ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,09,155 మంది వితంతువులకు స్పౌజ్‌ కేటగిరీ కింద పింఛన్ల మంజూరు చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల నుంచి ఒక్కొక్కరికి రూ.4వేలు చొప్పున అందిస్తారు.. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు కింద ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.2,750 కోట్లు విడుదల చేసింది. స్పౌజ్ కేటగిరి పింఛన్‌లకు సంబంధించి.. గతేడాది నవంబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా హామీ ఇచ్చారు. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే చనిపోయిన వారి భార్యలకు మరుసటి నెల నుంచి పింఛన్ అందిస్తారు. ఈ మేరకు 2023 నుంచి పింఛన్ తీసుకుంటూ చనిపోయిన భర్తను కోల్పోయిన మహిళలకు పింఛన్ మంజూరు కాలేదని తెలుసుకున్నారు. ఈ మేరకు అలాంటి వారిని గుర్తించి స్పౌజ్ కేటగిరి కింద పింఛన్ మంజూరు చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో స్పౌజ్ కేటగిరిలో పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింద స్పౌజ్ కేటగిరిలో పింఛన్ తీసుకొచ్చింది. పింఛను తీసుకునే భర్త చనిపోయిన భార్యకు ఆ మరుసటి నెల నుంచే పింఛన్‌ అందిస్తారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛను తీసుకుంటూ చనిపోయిన వారి భార్యలకు ఆ పింఛను బదిలీ చేయడానికి ప్రభుత్వం ఏప్రిల్ 24న చర్యలు మొదలుపెట్టింది. చనిపోయిన వ్యక్తి వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రం, జీవిత భాగస్వామి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో తీసుకుని.. అక్కడ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. కొత్త పింఛన్లకు సంబంధించి జూన్‌లో పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు కానీ వాయిదా పడింది.. జులై నెలలో కూడా కుదరలేదు.. చివరికి ఈ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. స్పౌజ్ కేటగిరిలో అర్హులైన అందరికీ రూ.4 వేల చొప్పున ఇంటికి వెళ్లి అందిస్తారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉండవల్లి నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో పర్యటిస్తారు. అక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం టీడీపీ నేతలతో సమావేశం అవుతారు.. అనంతరం గండికోటకు వెళ్లి అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత స్టేక్‌ హోల్డర్స్, ప్రాజెక్టు డెవలపర్లతో సమావేశం అవుతారు. అనంతరం గండికోట నుంచి బయల్దేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి వస్తారు.