: దిగ్గజ ఐటీ సంస్థ.. రెండు రోజుల కిందట షాకింగ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా టెక్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు సహా ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునే క్రమంలో మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల్ని దాదాపు 12,200 మందిని తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టీసీఎస్ సీఈఓ కృతివాసన్ చెప్పారు. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఇది 2 శాతం వరకు ఉంటుంది. అయితే ఈ కంపెనీ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ లేఆఫ్స్‌ను నిరసిస్తూ.. నెసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES).. కేంద్ర కార్మిక శాఖ మంత్రిని జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాసింది. ఈ ఉద్యోగుల తొలగింపు అనేది చట్ట విరుద్ధమని.. దీనిపై విచారణ జరపాల్సిందిగా కోరింది. నైట్స్.. టీసీఎస్ చర్యను ఖండించింది. అది అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలగింపుల్ని వెంటనే నిలిపివేయాలని.. ప్రభావితమయ్యే ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకునేలా చేయాలని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేసింది. ఐటీ సెక్టార్‌లో ఉద్యోగుల రక్షణ కోసం.. కఠిన నిబంధనల్ని రూపొందించాలని కోరుతోంది. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు అనేది చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది NITES. 'దాదాపు ఏడాది కంటే ఎక్కువ రోజులు పనిచేసిన ఏ ఉద్యోగిని కూడా కంపెనీ ఒక నెల ముందు అది కూడా నోటీసు ఇవ్వకుండా.. వేతనాలు చెల్లించకుండా.. నష్టపరిహారం చెల్లించకుండా లేదా ప్రభుత్వానికి తెలియజేయకుండా తొలగించొద్దని చట్టం స్పష్టంగా చెబుతోంది.' అని నైట్స్ వివరించింది. టీసీఎస్ ఈ నిబంధనలేం పాటించలేదని ఆరోపించింది. ఒక్కసారిగా ఉద్యోగుల తొలగింపుతో.. వేలాది మంది, వారి కుటుంబాలు జీవనోపాధి కోల్పోతారని వెల్లడించింది.ఐటీ శాఖ నిఘా..టీసీఎస్ నిర్ణయంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కూడా దృష్టి సారించింది. ఈ పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని తెలుస్తోంది. కంపెనీతో సంబంధిత వర్గాలు మాట్లాడుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉపాధి కల్పన అనేది కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశంగా ఉందని.. ఇతర ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల ద్వారా ఉద్యోగ అవకాశాల్ని ఎలా పెంచొచ్చనే అంశంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందని సమాచారం. అసలు లేఆఫ్‌లు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి, ఐటీ సంస్థలోని సమస్యలకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని సమాచారం. ఉద్యోగుల్లో భయాలు..టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయంతో.. ఇతర ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులు కూడా భయపడుతున్నారని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఏఐ, ఆటోమేషన్ ఎంట్రీతో .. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని గురించి చాలా మంది మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.