ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ఈ బస్సులకే పరిమితం.. ఈ గుర్తింపు కార్డులు తప్పనిసరి!

Wait 5 sec.

Andhra Pradesh Free Bus Scheme for Women: ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై క్లారిటీ వచ్చేసింది. ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తొలుత జిల్లాలకే పరిమితం చేయాలని భావించిన ప్రభుత్వం.. తర్వాత మనసు మార్చుకుంది. జిల్లాలకు పరిమితం చేస్తే మహిళలకు పెద్దగా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానంలోనే ఏపీలోనూ ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ప్రకటించారు.అయితే తాజాగా ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని ఏ బస్సులలో అమలు చేస్తారు.. ఏయే గుర్తింపు కార్డులు కావాలనే దానిపై క్లారిటీ వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ఈ వివరాలను వెల్లడించారు. ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ విషయంపై ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొంచెం క్లారిటీ ఇచ్చారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటుగా నగరాల్లోని సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ చెప్తున్నారు. అయితే ఆల్ట్రా డీలక్స్ బస్సులలో కూడా ఉచిత బస్సు పథకం అమలు చేస్తారనే వార్తలు వస్తున్నాయి.ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ఈ కార్డులు తప్పనిసరి..మరోవైపు ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో ఆధార్ కార్డు చూపించిన మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. కర్ణాటకలో ఇందుకోసం ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు తెచ్చారు. అయితే తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు పథకం అమలు చేస్తారని తెలిసింది. ఈ పథకం కింద బస్సులలో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. ఈ జీరో ఫేర్ టికెట్ల మీద ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణిస్తున్నారనే వివరాలతో పాటుగా.. ఉచిత బస్సు పథకం అమలు వలన ఆ మహిళకు ఎంత మేరకు లబ్ది చేకూరిందనే వివరాలను పొందుపరచనున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డుల సాయంతో మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడించారు. మహిళల జీవితాల్లో మార్పులు తేవడమే ఈ పథకం లక్ష్యమని.. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ నారాయణ తెలిపారు. అయితే ఉచిత బస్సు పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలు, వచ్చే ఏపీ మంత్రివర్గ సమావేశం తర్వాత అధికారికంగా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు.