భూలోక స్వర్గాలంటూ కొన్ని ప్రదేశాలను చెబుతుంటారు. కానీ భూలోక నరకం అని ఎప్పుడైనా విన్నారా? అవును భూమిపై నరకం లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అందులో ఇదొకటి. అక్కడికి వెళ్తే.. మీరు మళ్లీ తిరిగి రాలేరు!. బతికి బట్టకట్టాలని ప్రయత్నించినా.. అడుగడుగునా గండం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. ఎంతటి నిపుణులకైనా అక్కడికి వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుందంటే నమ్మండి. అదే బ్రెజిల్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. ఇల్హా డా క్వీమాడా గ్రాండే (). దాన్నే (Snake Island) అని కూడా అంటారు. 11,000 సంవత్సరాల క్రితం..బ్రెజిల్‌లోని సావో పాలో (São Paulo) రాష్ట్ర తీరానికి 93 మైళ్ల దూరంలో ఉంది స్నేక్ ఐలాండ్. ఎత్తైన కొండలు చెట్లతో మంత్రముగ్దులను చేసే ఈ ద్వీపం.. ప్రాణాలను క్షణాల్లో గాల్లో కలిపేయగలదు. 106 ఎకరాలు ఉన్న ఈ ద్వీపం.. 11,000 సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ ముగింపు దశలో బ్రెజిల్ మెయిన్‌ల్యాండ్ నుంచి వేరు పడింది. సముద్రమట్టం పెరగడంతో బ్రెజిల్ మెయిన్‌ల్యాండ్‌కు 93 మైళ్ల దూరంలో ఒంటరిగా మిగిలిపోయింది.అప్పటివరకు ఈ ప్రాంతంలో ఉన్న జరరక్కా (jararaca snakes) పాములు, పక్షులు ఈ ద్వీపంలోనే చిక్కుకుపోయాయి. ఆ తర్వాత ఈ ద్వీపం గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ అనే అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలకు ఆవాసంగా మారింది. ఈ స్నేక్ ఐలాండ్‌లో.. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ జాతి విష సర్పాలు మాత్రమే ఉంటాయి. బయట మెయిన్‌ల్యాండ్‌పై ఉన్న పాములతో పోలిస్తే.. ఈ పాముల విషం 3-5 రెట్లు ప్రమాదకరం. అయితే ఈ సామర్థ్యం వీటికే మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. వీటితో పాటు దిప్సాస్ ఆల్బిఫ్రాన్స్ (Dipsas albifrons) అనే విషపూరితం కాని పాములు స్నేక్ ఐలాండ్‌లో ఉంటాయని అంటారు. ఈ పాము కాటేస్తే.. మరణశాసనమే..!ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ముందు వరుసలో ఉంటుంది గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ (). దీని శాస్త్రీయ నామం బోత్రోప్స్ ఇన్సులారిస్ (Bothrops insularis). ఈ పాము కాటేస్తే మరణ శాసనమే. గంటలో మృత్యు ఒడిలోకి చేరుకుంటారు. దీని విషం.. శరీరంలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. మజిల్ నెక్రోసిస్ (muscle necrosis), మూత్రపిండాల ఫెయిల్యూర్, మెదడులో రక్తస్రావం అవుతుంది. ఈ ద్వీపానికి దగ్గర్లో ఏ ఆస్పత్రులు, ఎమర్జెన్సీ సర్వీసు స్టేషన్లు లేవు. త్వరగా సహాయం అందించడానికి ఏ మార్గాలూ లేవు. యమపాశాన్నైనా ఆపగలమేమో కానీ.. ఈ పాము కాటేస్తే ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యం!. బ్రెజిల్‌లో 90 శాతం పాముకాటు మరణాలకు కారణమైన రకానికి చెందినవే ఈ గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ స్నేక్స్. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ ఎందుకంత ప్రమాదకరం?ఈ ద్వీపంలో క్షీరద మాంసాహారులు (mammals) లేవు. దీంతో గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ పాముల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటి సాంద్రత కూడా వృద్ధి చెందడానికి వీలు కల్పించింది. ఇక భూమిపై నివసించే కీటకాలు వంటివి లేకపోవడం వల్ల ఆహార లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ పాములు ప్రధానంగా స్నేక్ ఐలాండ్‌కు వలస వచ్చే పక్షులపై ఆధారపడ్డాయి. ఈ ఆహార కొరత.. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ పాముల్లో ప్రత్యేక సామర్థ్యం రావడానికి కారణమైంది. ఈ పాముల్లో విషం మరింత ప్రమాదకరంగా మారడానికి దారితీసింది. మరింత ప్రమాదకర విషం.. వేగంగా కదిలే పక్షుల్ని త్వరగా చంపేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పాములను వేటాడే జంతువులు లేకపోవడం, ఉన్న తక్కువ ఆహార వనరుల కోసం అధిక పోటీ వల్ల.. ల్యాన్స్‌హెడ్ మనుగడ కష్టమైంది. అదే ఈ పాముల్లో పరివర్తనకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. అందుకే లైట్‌హౌజ్ మూసేశారు..ఈ గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ పాములు కాటేయడం వల్ల మనుషులు చనిపోయినట్లు రికార్డైన కేసులు ఏం లేవు. కానీ అనే కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న లైట్‌హౌజ్‌లో 1920 వరకు ఒక కుటుంబం పనిచేసేదని చెబుతారు. ఓ రోజు రాత్రి కిటికీల ద్వారా పాకి ఆ లైట్‌హౌజ్‌లోకి చొచ్చుకెళ్లి.. ఆపరేటర్, అతడి భార్య, ముగ్గురు పిల్లల్ని కాటేశాయని.. తప్పించుకునేందుకు పడవ దగ్గరికి పరుగెత్తే క్రమంలో చెట్ల కొమ్మలపై నుంచి మళ్లీ కాటేసి చంపేశాయనే అని తీర పట్టణాల ప్రజలు చెప్పుకుంటారు. అలాగే.. అనుకోకుండా ఆ ద్వీపానికి వెళ్లి.. అరటిపండ్లు తెచ్చుకుందామనుకున్న ఓ చేపలు పట్టే వ్యక్తి మళ్లీ తిరిగిరాలేదట. వీటిని బట్టి ఆ స్నేక్ ఐలాండ్ ఎంత ప్రమాదకరమే అర్థమవుతోంది. అడుగడుగునా గండం..ఆ ద్వీపంలో దాదాపు 2,000 నుంచి 4,000 వరకు గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ పాములు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే ఒక చదరపు మీటర్‌కు ఒక పాము ఉంటుంది. అంటే.. అడుగడుగునా ఒక పాము.. 'బుస్..' అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. వాటి పలకరింపునకే.. సగం గుండె ఆగిపోతుంది. నో-ఎంట్రీ..ఈ పాములు వేగంగా అంతరించిపోతున్న జాబితాలో (IUCN red list - International Union for Conservation of Nature) ఉన్నాయి. ఈ గోల్డెన్ ల్యాన్స్‌హెడ్‌ల నుంచి మనుషులను.. మనుషుల నుంచి వీటిని రక్షించడానికి.. బ్రెజిల్ ప్రభుత్వం ఈ ద్వీపానికి ఎంట్రీని బ్యాన్ చేసింది. బ్రెజిల్ నేవీ స్నేక్ ఐలాండ్‌కు కాపలా కాస్తోంది. కేవలం బ్రెజిల్ నేవీ అధికారులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ప్రత్యేక అనుమతులు తీసుకుని.. అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఐలాండ్‌ను సందర్శించాలి. అయితే కేవలం ఈ ఒక్క ఐలాండ్‌కే పరిమితమై.. అంతరించిపోతున్న ఈ పాములను.. విషం కోసం అక్రమ రవాణా చేసిన ఉదంతాలూ ఉన్నాయి. బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో పామును వేల కొద్దీ డాలర్లకు విక్రయించేవారని వార్తలు వచ్చాయి. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ పాములను ఎలా చూడొచ్చు?అవును.. మీరు గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ పాములను ప్రత్యక్షంగా చూడొచ్చు. కానీ స్నేక్ ఐలాండ్ వెళ్లి మాత్రం కాదండోయ్. వీటిని చూడడానికి ప్రధానంగా మూడు మార్గాలున్నాయి. సావో పాలో రాష్ట్రం బుటాంటన్ ఇన్స్టిట్యూట్‌లోని సెర్పెంటారియంలో ( Butantan Institute Serpentarium) ఉన్న అధికారులను నైస్‌గా అడిగితే గోల్డెన్ ల్యాన్స్‌హెడ్‌లను చూసేందుకు అనుమతి ఇవ్వొచ్చు. సావో పాలో ఉన్న జూలో ( São Paulo Zoo).. స్నేక్ ఎంక్లోజర్‌లో ఉన్న ఐదు పెద్ద గోల్డెన్ ల్యాన్స్‌హెడ్‌లను చూడొచ్చు.ఇవి రెండూ కుదరకుంటే.. సావో పాలో రాష్ట్రం సోరోకబా (Sorocaba city) నగరంలో ఉన్న Zoológico Municipal Quinzinho de Barrosకి వెళ్లి చూడొచ్చు. భౌగోళికంగా ఒంటరిగా ఉండటం, వాతావరణ ఒత్తిళ్ల వల్ల.. స్నేక్ ఐలాండ్‌లో భూమిపై అత్యంత విషపూరితమైన, ప్రత్యేకమైన పాములలో ఒకటైన గోల్డెన్ ల్యాన్స్‌హెడ్‌లు పరివర్తనం చెందాయి. ప్రకృతి ఎంతటి మాయ చేయగలదో చెప్పడానికి.. ఈ ద్వీపం, ఇక్కడ ఉన్న విష సర్పాలే నిదర్శనం. అందుకే అంతరించినపోతున్న అరుదైన పాము జాతులు, ఆవాసాలను రక్షించాల్సిన ప్రాముఖ్యతను ఈ స్నేక్ ఐలాండ్ గుర్తుచేస్తోంది. మరి ఈ స్పెషల్ గోల్డెన్ ల్యాన్స్‌హెడ్‌ ఫ్రెండ్స్‌ను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే ఇది భూలోక నరకం అని ముందే చెప్పాం కదా! మనం రోజూ మాట్లాడుకునే నరకానికి.. భూలోక నరకం అని చెప్పుకుంటున్న ఈ స్నేక్ ఐలాండ్‌కు ఒక చిన్న తేడా ఉంది. మనం చనిపోతే నరకానికి వెళ్తాం. కానీ చనిపోవాలనుకుంటే ఈ స్నేక్ ఐలాండ్‌కి వెళ్లాలి..!