మాంచెస్టర్ టెస్టులో టీమిండియా బ్యాటర్లు పోరాడుతున్నారు. ఓటమి తప్పించుకోవాలంటే తప్పక నిలవాల్సిన స్థితిలో చేస్తున్నారు. సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశ నుంచి మరో 62 ఓవర్లు వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. 174/2తో నాలుగో రోజు ఆట ముగించారు. అయితే భారత్‌కు ఇంకా ప్రమాదం పొంచే ఉంది. ఎందుకుంటే ఈ మ్యాచులో డ్రా చేసుకోవాలంటే భారత్ చివరిరోజు నిలబడాల్సి ఉంది. ఇంకా 137 పరుగులు వెనకబడి ఉన్న భారత్.. చివరి రోజు 90 ఓవర్లలో ఎంతసేపు బ్యాటింగ్ చేస్తుందనే అంశంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (87), గిల్ (78) ఉన్నారు. నిజానికి మరో వికెట్ పడితే బ్యాటింగ్‌కు రావాలి. కానీ ఈ టెస్టు తొలి రోజు ఆటలో గాయపడ్డ పంత్.. వికెట్ కీపింగ్ చేయట్లేదు. నొప్పితో ఇబ్బంది పడుతూనే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కు వస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించారు. పంత్ బ్యాటింగ్‌కు దిగుతాడని సంకేతాలు ఇచ్చాడు."మాంచెస్టర్ టెస్ట్‌లో చివరి రోజు భారత్ ఎదుర్కొనే ప్రతీ బంతి కీలకమే. కానీ మన బ్యాటర్లు.. నాలుగో రోజు ఆడినట్లే ఆడతారని అనుకుంటున్నా. పెద్దగా ఆలోచించకుండా.. ఒక్కో బంతిని ఆడుతూ పోవాలి. ఎక్కడా కూడా రిస్క్ షాట్లకు పోకూడదు. ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాక.. షాట్లు ఆడితే.. ప్రత్యర్థి ఒత్తిడిలో పడుతుంది. ఇంకా చాలా మంది నాణ్యమైన బ్యాటర్లు బ్యాటింగ్‌కు రావాల్సింది. వాళ్లందరికీ కావాల్సినంత అనుభవం ఉంది. స్కిల్‌తో పాటు.. మానసికంగా కూడా ఫిట్‌గా ఉండాలి. తొలి రోజు ఆటలో గాయపడ్డ రిషభ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ బ్యాటింగ్‌ చేస్తాడని అనుకుంటున్నా" అని సితాన్షు కొటక్ అన్నాడు.పంత్ గాయపడ్డ తర్వాత అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. అవసరమైతే బ్యాటింగ్‌కు వస్తాడని మాత్రమే చెప్పింది. దీంతో ఐదో రోజు కూడా పంత్ బ్యాటింగ్ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి.