పవర్ స్టార్ తాజాగా నటించిన చిత్రం హరి హర వీరమల్లు. పవన్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను మెగా సూర్య బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మించగా.. ఏ ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సారధ్యంలో తెరకెక్కింది. ఇక సినిమా విడుదలకు ముందు నుంచే ట్రైలర్లు, పాటలతో.. విడుదల తర్వాత మాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఏపీలోని ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో ఆల్ టైమ్ రికార్డ్ నంబర్ గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. పవన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే.. నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో . జనసేన ఎమ్మెల్యే అద్వర్యంలో రాజానగరం నియోజవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అందరికి ఈ ఫ్రీ షో చూసేందుకు అవకాశం లేదు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో గవర్నమెంట్ స్కూల్, కాలేజీలలో చదివే 9, 10వ తరగతి విద్యార్థులు, అలానే ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులను మాత్రమే హరి హర వీరమల్లు ఫ్రీ షోకు అనుమతించనున్నారు. నేడు అనగా జులై 27 ఆదివారం సీతానగరంలోని గీత సినిమాస్‌లో ఉచితంగా సినిమాను ప్రదర్శించనున్నారు. అలాగే కోరుకొండలోని రామకృష్ణ థియేటర్‌లో కూడా హరి హర వీరమల్లు ఫ్రీ షోలు వేయనున్నారు. ఈ తరం విద్యార్థులకు తెలియాజేయాలనే ఉద్దేశంతో హరిహర వీరమల్లు సినిమాను విద్యార్థులకు ఉచితంగా చూపించబోతున్నట్టు ఎమ్మెల్యే బత్తుల బలరామ క‌ృష్ణ తెలిపారు. అలానే రాజనగరంతో పాటుగా మరి కొన్ని ప్రాంతాల్లో కూడా హరి హర వీరమల్లు ఫ్రీ షోలు వేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరి హర వీరమల్లు సినిమాను ప్రదర్శించనున్నారు. శని, ఆదివారాలు(జులై 26, 27) రెండు రోజులు ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నెల 24న విడుదలైన వీరమల్లు సినిమా.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలైన తొలి సినిమా కావడంతో.. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.