తెలంగాణ ఆర్థిక వృద్ధికి సూపర్ గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న వెంబడే ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. సుమారు 400 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రవాణా, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. రీజినల్ రింగ్ రైల్వే లైన్ రాష్ట్రానికి ఎంతో కీలకమని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ఆర్ఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టును సమర్థించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడంతో, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ పర్యటనలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే జీఎంను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ వెంబడే రైల్వే లైను వచ్చే విధంగా చూడాలని సూచించారు.కేంద్ర మంత్రి ఆదేశాల నేపథ్యంలో.. రైల్వే జీఎం రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో రెండుసార్లు సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ ప్రతిపాదనలు, మార్గం గురించి సమగ్ర వివరాలను సేకరించి, రైల్వే లైన్ ఏర్పాటుకు ఎంత భూసేకరణ అవసరం, సాంకేతిక సమస్యలు వంటి అంశాలపై చర్చించారు. ఆర్ఆర్ఆర్ వెంట రైల్వే లైన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్లు, లైన్ల అనుసంధానం, జంక్షన్లు వంటి విషయాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వచ్చే వారం మరోసారి రైల్వే, రాష్ట్ర రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ చర్చల అనంతరం భూసేకరణ, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం కోసం 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించగా, దక్షిణ భాగంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. రింగ్ రైలు కోసం కనీసం 50 మీటర్ల వెడల్పుతో ఉత్తర, దక్షిణ భాగాల్లో భూసేకరణ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, జంక్షన్ల వద్ద అదనపు భూమి అవసరం ఉంటుంది. రోడ్డుకు ఎత్తు ఎక్కువ అవసరం కాగా, రైల్వే లైన్‌కు అలా అవసరం లేదు. ఇలా రెండింటినీ పక్కపక్కనే ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైల్వే శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.రైల్వే లైన్ ఏర్పాటు దాదాపు ఖరారైనట్లు అధికారులు చెబుతున్నారు. రీజినల్ రింగు రైల్ నిర్మాణం పూర్తయితే, ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెంది, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ లైన్ వెళ్లే జిల్లాలు, మండలాలు, గ్రామాల రూపురేఖలు రాబోయే రోజుల్లో పూర్తిగా మారి, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా వృద్ధి చెందుతాయని విశ్లేషిస్తున్నారు.