ఏపీలో పథకంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 15 నుంచి 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబోతున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా.. 5 రకాల బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు.అలాగే ఉచిత బస్సు పథకం ద్వారా ఆటోడ్రైవర్ల ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆగస్ట్ 15వ తేదీనే ఆటోడ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను.. ఆగస్టు 2, 3వ తేదీలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అలాగే అర్హులైన వితంతువులకు వచ్చే నెల ఒకటే తేదీన పింఛన్లు అందిచనున్నట్లు అచ్చెన్నాయుడు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదన్న అచ్చెన్నాయుడు.. మంత్రి నారా లోకేష్‌తో ఈ విషయం గురించి చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకే పరిమతం చేస్తారంటూ వార్తలు వచ్చాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారంటూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఉచిత బస్సు పథకం కేవలం జిల్లాకే పరిమితం చేయమని.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించడం విశేషం. మరోవైపు ఉచిత బస్సు పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ఇటీవల జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు ఆదేశించిన సంగతి తెలిసిందే. జీరో ఫేర్ టికెట్‌లో ప్రయాణం తాలూకూ వివరాలతో పాటుగా ఉచిత పథకం ద్వారా వారికి ఏ మేరకు లబ్ధి జరిగిందనే వివరాలు కూడా ఉండాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.