హైదరాబాద నగరవాసులకు గుడ్‌న్యూస్. పొందవచ్చు. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు 'ఒక నగరం.. ఒక వెబ్‌సైట్.. ఒక మొబైల్ యాప్' నినాదంతో సరికొత్త డిజిటల్ వేదికను జీహెచ్ఎంసీ త్వరలో ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రజలు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే తమ మొబైల్ ఫోన్ ద్వారా అన్ని పౌర సేవలను పొందవచ్చు, సమస్యలపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు.వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వడం ద్వారా ఆ నంబర్‌కు అనుసంధానించబడిన అన్ని వివరాలు ఒకేచోట చూసుకోవచ్చు. వీటిలో ఆస్తిపన్ను, ఇంటి నిర్మాణ అనుమతులు, పెంపుడు జంతువుల లైసెన్స్, జనన ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్స్,గుత్తేదారుల కాంట్రాక్టులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్లు, క్రీడలకు సంబంధించిన సభ్యత్వాలు వంటివి ఉంటాయి. అవసరమైనప్పుడు ఈ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల సేవలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఫిర్యాదుల పరిష్కారం కోసం సమీకృత కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తిపన్ను దరఖాస్తులన్నీ డిజిటలైజ్ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, మైజీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయితే, ఈ సేవల్లో కొన్ని పరిమితులు, లోపాలు ఉన్నాయని, అవి పూర్తిస్థాయిలో ప్రజలకు ఉపయోగపడటం లేదని గుర్తించారు. ఈ లోపాలను సరిచేసి, మరిన్ని అదనపు ఫీచర్లతో కొత్త వేదికను తీసుకురావాలని కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. వినియోగదారులకు ఫోన్ నంబర్‌తో ప్రత్యేక ఖాతా ఉండేలా, వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, రసీదులు కనిపించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఆయన సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)ని ఆదేశించారు. ఈ కొత్త వేదిక ద్వారా పౌర సేవలు మరింత సులభతరం, పారదర్శకం అవుతాయని GHMC ఆశిస్తోంది. ఇక హైదరాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడానికి జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రారంభించారు. ఇకపై ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే, 74166 87878 అనే వాట్సాప్ నంబర్‌కు నేరుగా పంపవచ్చు. ఈ వ్యవస్థ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వేగవంతమైన సమాచార మార్పిడిని సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు.