ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుటంబానికి భారీ పరిహారం అందబోతోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో రాజుపాలెం-ఇసుకపల్లి రోడ్డు పనులు చేపట్టారు. ఈ కాంట్రాక్ట్‌ను పైడాల తిరుపతిరెడ్డి అండ్‌ బ్రదర్స్‌ దక్కించుకున్నారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయుడు (పీఈటీ) దాసరి కామరాజ్‌ ఈ రోడ్డులో వెళుతుండగా జరిగిన . రోడ్డు కోసం గుంతలు తీశారు.. కానీ అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. కామరాజ్ బైక్ మీద వెళ్తూ ఆ గుంతను గమనించలేదు.. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. వెంటనే కొడవలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కామరాజ్‌కు భార్య, తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కామరాజ్ కుటుంబం నెల్లూరు మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు వేశారు. కామరాజ్‌కు ఇంకా 12 ఏళ్ల సర్వీసు ఉంది. ఆయన జీతం, బెనిఫిట్స్ అన్నీ కలిపి 90 లక్షలు పరిహారంగా ఇప్పించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ కేసును మూడో జిల్లా అదనపు కోర్టు ఐదేళ్లపాటు విచారించింది. చివరికి కోర్టు రూ.81.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ఆర్ అండ్ బీని ఆదేశించింది. అంతేకాదు, కేసు వేసినప్పటి నుంచి తీర్పు వచ్చే వరకు వడ్డీతో కలిపి చెల్లించాలని తెలిపింది.. వడ్డీ సహా రూ.1.29 కోట్లు ఇవ్వాలని కోర్టు తీర్పును వెల్లడించింది.జిల్లా కోర్టు తీర్పును ఆర్ అండ్ బీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు గత నెలలో విచారణకు వచ్చింది. హైకోర్టు స్పందిస్తూ.. "కేసు విచారణ కంటే ముందు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సగం పరిహారాన్ని బాధిత కుటుంబానికి జమ చేయాలి. ఆ మొత్తంలో సగాన్ని వారు తీసుకోవచ్చు" అని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించింది. అయితే కాంట్రాక్టర్ పైడాల తిరుపతిరెడ్డికి R&B ఈఈ రామకృష్ణప్రసాద్ నోటీసు ఇచ్చారు.. ఈ మేరకు పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే తన తప్పేమీ లేదని కాంట్రాక్టర్ ఈఈకి వివరణ ఇచ్చారు కాంట్రాక్టర్. దీంతో అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంతలో కోర్టు ఆదేశాల్ని అమలు చేయని కారణంగా నెల్లూరు కలెక్టరేట్‌లోని చరాస్తుల్ని జప్తుచేయాలని హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పరిహారంలో 50 శాతం మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని అధికారులు నిర్ణయంచారు. ఈ మేరకు కామరాజ్ కుటుంబానికి రూ.1.29 కోట్ల పరిహారంలో 50 శాతాన్ని కోర్టులో డిపాజిట్‌ చేసేందుకు ప్రభుత్వం నిధులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.