ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్.. ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే, లేకపోతే డబ్బులు ఇవ్వరు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల కొత్త హాజరు నమోదు విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో వచ్చే నెల 10 నుంచి ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానం అమల్లోకి రానుంది. ఈ సరికొత్త విధానంతో ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో హాజరు వేయించుకోవడం కుదరదు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఈ ముఖ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సరికొత్త విధనానికి సంబంధించి జిల్లాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి మాస్టర్‌ ట్రైనీల ద్వారా శిక్షణ అందిస్తున్నారు.ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానం ద్వారా ఇకపై దొంగ హాజరులకు అడ్డుకట్ట వేయొచ్చు అంటున్నారు. ఉపాధి హామీ కూలీల ఫోటోలను NMMS యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. జరిగే ప్రదేశంలో ఉదయం, సాయంత్రం ఫోటోలు తీసి అప్‌లోడ్ చేస్తారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లోనే హాజరు వేయడం సాధ్యమవుతుంది.. ఒకవేళ ఎవరైనా ఒకరి బదులు మరొకరు హాజరైతే, యాప్ వెంటనే గుర్తిస్తుంది. వారి ఫోటోలను యాప్ అనుమతించదు. దీనివల్ల ఆన్‌లైన్‌లో హాజరు వేయడం కుదరదు. అక్రమాలను నివారించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది అంటున్నారు అధికారులు. గతంలో సాధారణ హాజరు విధానంతో ఎన్నో అవకతవకలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. ఒకే వ్యక్తి చాలా చోట్ల వేర్వేరు పేర్లతో హాజరయ్యేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఫోటో అప్‌లోడ్ చేయడం వల్ల అది సాధ్యం కాదు అంటున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి అనే వ్యక్తి ఒకే పంచాయతీలో నాలుగు చోట్ల ఉపాధి హామీ పనలకు హాజరయ్యేవారు. ఒక చోట తన పేరుతో, మిగిలిన మూడు చోట్ల వేర్వేరు జాబ్ కార్డులతో హాజరు వేయించుకునేవారు. అయితే ఈ ముఖ ఆధారిత అటెండెన్స్ విధానం ఇలాంటి మోసాలను అరికడుతుంది అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో దొంగ మస్టర్లు ఎక్కువగా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ స్థాయి నేతలు, సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. చనిపోయిన వారి పేర్లతో కూడా డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయంటున్నారు. ఇకపై అలాంటివి కుదరవంటోంది ప్రభుత్వం.