తెలంగాణలో మరో హైవే విస్తరణ.. 4 వరుసలుగా, త్వరలోనే..!

Wait 5 sec.

తెలంగాణలో మరో విషయంలో కీలక ముందడుగు పడింది. (NH-563) విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. సోమవారం ఢిల్లీలో గడ్కరీతో సమావేశమైన సంజయ్.. ఈ రహదారి పనులతో పాటు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) మంజూరుపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2,151.35 కోట్ల అంచనాతో గత ఎన్నికల ముందు చేపట్టిన కరీంనగర్-జగిత్యాల రహదారి నాలుగు వరుసల విస్తరణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదని బండి సంజయ్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని CRIF నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. రూ. 113 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలను గడ్కరీకి అందజేశారు. ఈ నిధుల విడుదలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ వెల్లడించారు. ఇక కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి (NH-563) ప్రధానంగా కరీంనగర్, జగిత్యాల జిల్లాల గుండా వెళ్తుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు, జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్, ధర్మపురి, జగిత్యాల పట్టణాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. అయితే ప్రధానంగా ఈ రెండు జిల్లాల పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలుపుతుంది. ఈ రహదారి విస్తరణతో స్థానిక రైతులకు, ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. నాలుగు వరుసల రహదారి నిర్మాణం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. కరీంనగర్-జగిత్యాల మధ్య దూరం తక్కువ సమయంలో చేరుకోవచ్చు.రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు, శీతల గిడ్డంగులకు, ప్రాసెసింగ్ యూనిట్లకు సులభంగా, వేగంగా తరలించే అవకాశం లభించనుంది. మెరుగైన రహదారి సౌకర్యాలు వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయి. ఇది స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది, ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. ఈ మార్గంలో ఉన్న ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలకు, ఇతర పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం సులభతరం అవుతుంది, తద్వారా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. స్థానిక రైతుల భూముల ధరలు కూడా పెరగనున్నాయి.