తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయా..? వాతావరణశాఖ ఏం చెప్పిందంటే..

Wait 5 sec.

తెలంగాణలో గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. జూలై 27 వరకు రాష్ట్రంలో సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 33.40 సెం.మీ.లు కాగా.. 33.68 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ములుగు, ఖమ్మం, నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగరం, వెంకటాపురం, మంగపేట వంటి ఏజెన్సీ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585 అడుగులకు చేరుకుంది. మూసీ క్యాచ్‌మెంట్ ఏరియాస్‌లో కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వర్షాలతో నీటి మట్టం పెరిగి, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించింది. సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి వంటి వాటిలో కూడా నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో నేటి వర్షాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడం వల్ల లభించిందని చెప్పారు. రానున్న వారం నుంచి పది రోజుల వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. అయితే, ఎండల తీవ్రత కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, సాయంత్రం వేళ అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఈ నెల 23 నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో గతంలో ఉన్న లోటు వర్షపాతం తీరిందని వెల్లడించింది. మొత్తంగా, ప్రస్తుతం వర్షాలకు విరామం లభించినప్పటికీ.. ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని, కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.