హైదరాబాద్: షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. 25 ఏళ్ల యువకుడు స్పాట్ డెడ్

Wait 5 sec.

హైదరాబాద్ నాగోల్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఇండోర్ స్టేడియంలో ఓ యువకుడు షటిల్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. అప్పటి వరకు ఉత్సాహంగా షటిల్ ఆడిన 25 ఏళ్ల యువకుడు గుండ్ల రాకేష్ ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం (జూలై 27) సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడైన రాకేష్.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నాగోల్ పరిధిలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం షటిల్ ఆడేందుకు ఇండోర్ స్టేడియం వెళ్లాడు. స్నేహితులతో షటిల్ ఆడుతూనే.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వారు వెంటనే అతడికి సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే రాకేష్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాదర ఘటన స్టేడియంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.