హైదరాబాద్: రూ.19 లక్షలకే 2 BHK ఫ్లాట్‌.. ఇవాళే లాస్ట్ డేట్, వివరాలివే..

Wait 5 sec.

హైదరాబాద్‌లో సొంతిల్లు నిర్మించుకోవాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, ప్రస్తుతం నగరంలో భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు భారీగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలకు అది కష్టంగా మారింది. దానికి తోడు హైడ్రా భయాలు చాలా మందిలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే ఇంటిని సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. తక్కువ బడ్జెట్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశం. హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డు వేలం వేస్తోంది. రాజీవ్ స్వగృహ పరిధిలోని బండ్లగూడలో ఉన్న వివిధ టవర్లలోని 159 ఫ్లాట్లకు బుధవారం (జులై 30) లాటరీ నిర్వహించారు. ఈ లాటరీ ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఫ్లాట్ల కోసం ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. 11 త్రీ BHK ఫ్లాట్లకు దాదాపు 1325 దరఖాస్తులు వచ్చాయి. 19 టు BHK ఫ్లాట్లకు 525 దరఖాస్తులు రాగా.. సింగిల్ బెడ్‌రూమ్ (105 ఫ్లాట్లు) 234 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 159 ఫ్లాట్లలో సీనియర్ సిటిజన్లకు కేటాయించినవి పోగా, మిగిలిన వాటికి ఈ దరఖాస్తులను స్వీకరించారు. లాటరీ ప్రక్రియ సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించిన ఫ్లాట్లతో ప్రారంభమైంది.పోచారంలో ఫ్లాట్లకు మరో అవకాశం కల్పించారు. బండ్లగూడలో ఫ్లాట్లు దక్కని దరఖాస్తుదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వారు అదే రసీదులతో పోచారంలో ఉన్న ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు ప్రకటించింది. 255 సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉండగా.. వాటిని రూ.13 లక్షలుకు విక్రయించనున్నారు. 2 BHK ఫ్లాట్లు 340 అందుబాటులో ఉండగా.. వాటిని రూ.19 లక్షల చొప్పున విక్రయించనున్నారు. ఈ ఫ్లాట్లకు ఇవాళ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 1, 2 తేదీలలో లాటరీ నిర్వహించనున్నారు. తక్కువ ధరలకు ప్రభుత్వమే ఫ్లాట్లను అందిస్తుండటంతో, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ భూముల ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా, ఓపెన్ ఆన్‌లైన్ వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.65.34 కోట్లకు అమ్ముడుపోయింది. కూకట్‌పల్లి ఫేజ్-4లో ఉన్న ఈ ప్లాట్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ICAI) సంస్థ అత్యధిక ధరకు దక్కించుకున్నట్లు హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఈ వేలంపాట ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఈ ధర నగరంలో భూముల విలువ ఎంత వేగంగా పెరుగుతుందో మరోసారి రుజువు చేసింది.