ఆ ఏరియాల్లో కొత్త పథకం.. 2 లక్షల మందికి లబ్ధి, సీఎం రేవంత్ ఆదేశాలు

Wait 5 sec.

ఇందిర సోలార్ రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో 2 లక్షల 10 వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలనిన్నారు. 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇంధన శాఖపై సమీక్షించారు. NPDCL, SPDCL లతో పాటు కొత్తగా మరో డిస్కమ్‌ను ఏర్పాటు చేసి దాని పరిధిలోకి వ్యవసాయ రంగంతో పాటు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్లు, కాలేజీలకు తీసుకురావాలని సూచించారు. దీనికి రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని అన్నారు.ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అంటే ఏమిటి?తెలంగాణ ప్రభుత్వం గిరిజన రైతుల కోసం ప్రవేశపెట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన పథకమే ఇందిర సౌర గిరి జల వికాసం పథకం. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. దీని ద్వారా, గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. విద్యుత్ సౌకర్యం లేని పోడు భూముల్లో, గిరిజన రైతులందరికీ 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందజేస్తారు. నీటి వనరులు లేని భూముల్లో బోర్లు లేదా బావులు తవ్వించి నీటి సౌకర్యాన్ని కల్పిస్తారు.ఈ పథకం ద్వారా, కేవలం నీటిని అందించడమే కాకుండా, భూమిని సాగు యోగ్యంగా మార్చడం, విత్తనాలు, ఎరువులు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం వంటివి కూడా చేపడతారు. గిరిజన రైతులు కేవలం వర్షం మీద ఆధారపడకుండా, నీటి వసతితో లాభదాయకమైన పంటలు పండించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకం ప్రధానంగా పోడు భూముల పట్టాలు పొందిన గిరిజన రైతులకు ఉపయోగపడుతుంది. అటవీ హక్కుల చట్టం 2006 (RoFR) కింద పట్టాలు పొందిన గిరిజన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఒక యూనిట్ (బోరు, పంపుసెట్) వ్యక్తిగతంగా అందిస్తారు. 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు, సమీపంలోని 2-5 మంది రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఒక యూనిట్‌ను అందజేస్తారు. ఈ పథకానికి రేవంత్ సర్కార్ రాబోయే ఐదేళ్లలో రూ. 12,600 కోట్లు ఖర్చు చేయనుంది.