భారత్‌పై 'ట్రంప్' భారం రూ.2.60 లక్షల కోట్లు.. రొయ్య, జౌళి సహా ఈ ఎగుమతులపై ప్రభావం!

Wait 5 sec.

Trump Tariff: భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతోంది. క్రమంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని విధంగా భారత్‌కు షాకిచ్చారు. భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25 శాతం సుంకాల విధిస్తామని, దానికి అదనంగా పెనాల్టీలు సైతం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)పై 0.2 శాతం నుంచి 0.5 శాతం అంటే 30 బిలియన్ డాలర్లు (రూ.2.60 లక్షల కోట్ల) మేర ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల కంటే భారత్‌పైనే అధిక పన్నులు విధిస్తున్నారని తెలిపారు. ట్రంప్ సుంకాల పెంపుతో భారత్‌కు చెందిన ఉక్కు, అల్యూమినియం, వాహన విడిభాగాల, రొయ్యలు, జౌళి, రత్నాభరణాలు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ సహా ఆహారోత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికాకు 10 బిలియన్ డాలర్ల వరకు రత్నాభరణాలు ఎగుమతి అవుతున్నాయి. దీనిపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే భారత్ సముద్ర ఆహార ఉత్పత్తులైన రొయ్యల వంటి వాటి ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యవసాయ ఆర్థిక వేత్త అశోక్ గులాటి పేర్కొన్నారు. 10-15 శాతం సుంకాలు ఉంటాయని భావిస్తే అంతకు మించి విధించడం అనేది దిగ్భ్రాంతికి గురి చేసినట్లు చెప్పారు. భారత్- బ్రిటన్ ఒప్పందంతో జౌళి పరిశ్రమకు కలిగి ప్రయోజనాలు అమెరికా నిర్ణయంతో ప్రభావితమవుతాయని అన్నారు. ఇండోనేషియాపై అమెరికా 20 శాతం సుంకాలు విధిస్తోంది. అలాగే వియత్నాంపై 19 శాతం టారిఫ్స్ విధిస్తోంది. ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే రష్యా నుంచి మిలటరీ సామగ్రి, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకే టారిఫ్ పై అదనంగా పెనాల్టీ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఆయా రంగాల్లోని కంపెనీల్లో అనిశ్చితి నెలకొందని ఫియో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితేనే అనిశ్చితి తొలగి స్థిరత్వం వస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచింది. తొలి త్రైమాసికంలో మన ఎగుమతులు 22.18 శాతం మేర పెరిగాయి. 25.51 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాది 2024లో చూసుకుంటే అమెరికాకు ప్రధానంగా ఎగుమతి అయిన వాటిల్లో ఔషధ ఫార్ములేషన్లు 8.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. టెలికాం సామగ్రి 6.5 బిలియన్ డాలర్లు, రత్నాలు 5.3 బిలియన్ డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తులు 4.1 బి.డాలర్లు, వాహన, వాహన విడిభాగాలు 2.8 బి.డాలర్లు, బంగారం, ఇతర ఆభరణాలు 3.2 బి.డాలర్లు, రెడీమేడ్ దుస్తులు, ఇనుము, ఉక్కు కలిపి 5.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.