ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విభాగాల్లో అభివృద్ధి చేయడానికి సింగపూర్ సహకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌తో సోమవారం భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చించినా ఆయన.. ఆ రికార్డులు సరిచేసేందుకే తాను సింగపూర్ వచ్చినట్లు స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్ కారిడార్లు, పోర్టులు ఇలా అన్ని రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం కావాలంటూ టాన్ సీ లెంగ్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సింగపూర్‌పై అభిమానంతో గతంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్‌ నిర్మించినట్లు ఆయన తెలిపారు. సింగపూర్‌ని చూసే హైదరాబాద్‌లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తు చేశారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం మరీ మరీ చెప్పారు. అందుకోసమే నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలంటూ టాన్ సీ లెంగ్‌ను ఆహ్వానించారు. నాలెడ్జ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సింగపూర్ భాగస్వామ్యం కావాలని కోరారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ఏపీఓ పోర్టుల నిర్మాణంలోనూ సహకరించాలన్నారు. అనంతరం టాన్ సీ లెంగ్ మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబును కలిశానని, ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో సింగపూర్‌లో పది వేల కుటుంబాలు నివసించే బిడదారి ఎస్టేట్‌లో రెండు గంటల పాటు సీఎం పర్యటించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో నాణ్యమైన నివాస గృహాల నిర్మాణంపై చంద్రబాబు సింగపూర్ అధికారులతో చర్చించారు. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును పూర్తిగా సందర్శించారు. అనంతరం ప్రపంచ బ్యాంక్ అధికారులతో సీఎం బృందం సమావేశమయ్యారు. విషయంలో సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో నారా లోకేశ్‌తో పాటు మంత్రులు నారాయణ, టీజీ భరత్ పాల్గొన్నారు.