వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. పులివెందుల, స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుద‌లైంది. జూలై 30వ తేదీ నుంచి ఆగస్ట్ 1వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు రెండో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్ట్ ఐదో తేదీ వరకూ సమయం ఉంది. ఆగస్ట్ 12న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్ట్ 14వ తేదీ కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీటీసీ స్థానం పరిధిలోకి వచ్చే మండలాల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. పులివెందులలో మొత్తం 10,601 ఓట్లు నమోదైనట్లు తెలిసింది. అలాగే ఒంటిమిట్టలో 24,606 ఓట్లు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అలాగే జెడ్పీటీసీ ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల కోసం పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించారు. జులై 19వ తేదీ అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు ఖాళీగా ఉన్న సర్పంచ్ స్థానాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహించనున్నా్రు. ఆగస్ట్ పదో తేదీ పోలింగ్ జరగనుంది. మరోవైపు 2021లో ఒంటిమిట్ట జెడ్పీటీసీగా గెలిచి ఆ తర్వాత రాజంపేట జెడ్పీ ఛైర్మన్ అయ్యారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజంపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన జెడ్పీ ఛైర్మన్, జెడ్పీటీసీ పదవులకు రాజీనామా చేయటంతో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో అప్పటి నుంచి పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఖాళీగా ఉంది. దీంతో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను సాధారణంగా పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. కాకపోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కడపలో వైఎస్ జగన్‌కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్న టీడీపీ కూటమి ఈ ఎన్నికలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.