"రేయ్ మచ్చా.. మనలో మన మాట ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? అని ఎప్పుడైనా మీ ఫ్రెండ్‌ని అడిగారా? ఒకవేళ మీరు అడిగారంటే ఒకటి కావాలని వాడి బాధలు వినడానికి అడిగి ఉండొచ్చు.. లేదంటే మీకు ఇంకా పెళ్లి అయి ఉండకపోవచ్చు..." ఏంటి వీడు రివ్యూ మొదలుపెట్టకుండా సోది చెబుతున్నాడనుకోకండి. ఎందుకంటే గుడ్డు పెట్టే కోడికే ఆ కష్టం తెలుస్తుంది.. అలానే పెళ్లి అయిన వారికే ఆ బాధలు అర్థమవుతాయి. అయితే ఇక్కడ పెళ్లి అయిన మగాళ్లకే బాధలు అని అర్థం చేసుకోండి.. పెళ్లి అయిన లేడీస్ విషయంలోనూ ఇదే పరిస్థితి. అయితే దీన్ని జనరలైజ్ చేయలేం. పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న జంటలు కూడా చాలానే ఉన్నాయి.అయితే ఇక్కడ ఆనందం అంటే అర్థం.. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండటం కాదు. కష్టం చూస్తేనే కదా సుఖం విలువ ఏంటో తెలిసేది.. బాధ వస్తేనే కదా ఆనందం ఎంత బావుంటుందో అర్థమయ్యేది.. అలానే జీవితం అంటే అన్నీ ఉంటాయి. మరి ఆ పెళ్లి కూడా జీవితంలో ఓ భాగమే కదా. మ్యారేజ్ లైఫ్ అంటే మొదటి మూడు నెలలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా అల్లుకుపోయి ఉండటం కాదు.. మూడు దశాబ్దాలైనా అంతే ప్రేమతో ఉండటం.. ఇక ఈ మధ్యలో తిట్లు, గొడవలు, అలకలు, రాగాలు, కొట్లాటలు అంటారా.. అవన్నీ పాయసంలో వచ్చే కిస్‌మిస్, జీడిపప్పులు అనుకోవడమే.. నిజానికి అవి ఉంటేనే జీవితం జీవితంలా సాగుతుంది. కానీ ఎన్ని వచ్చినా.. ఏం జరిగినా.. ఎంతమంది మధ్యలో విడగొట్టడానికి దూరినా భార్య-భర్త ఎప్పుడూ కలిసే ఉండాలి.. అనే చిన్న లైన్‌తో తీసిన చిత్రమే 'సార్ మేడమ్'. ఇక లేటు చేయకుండా రివ్యూలోకి వెళ్లిపోదాం.కథ కాదు మన జీవితమేఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) తన ఊరిలోనే పెద్ద పరోటా మాస్టర్. ఒకటి రెండు కాదు రకరకాల పరోటాలు ట్రై చేస్తూ హోటల్‌ నడుపుతుంటాడు. ఇక పక్క ఊరిలో రాణి (నిత్యా మీనన్) అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. తొలి చూపులోనే ఆ అమ్మాయి ఇక రాణి కాదు మహారాణి.. అలానే జీవితాంతం చూసుకుంటా అంటూ వీరయ్య వీర లెవల్లో అందరిముందు చెబుతాడు. అయితే వీరయ్య ఫ్యామిలీ ఈ పెళ్లి సెట్ అవ్వాలని చిన్నచిన్న అబద్ధాలు ఆడతారు. 10వ తరగతి ఫెయిల్ అయిన వీరయ్య డబుల్ MA చేశాడని, లీజ్‌కి తీసుకొని ఉంటున్న ఇల్లు సొంతిల్లని.. ఇలా కొన్ని అబద్ధాలు ఆడతారు.అయితే వీరయ్య పరోటా రుచికి పడిపోయిన నిత్య పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. దీంతో పెళ్లికి ముందే వెరైటీ వెరైటీ పరోటాలు తెచ్చి కాబోయే పెళ్లానికి ఇస్తూ ఉంటాడు. ఇంతలో వీరయ్య కుటుంబం బ్యాక్ గ్రౌండ్ తెలిసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది రాణి ఫ్యామిలీ. కానీ అప్పటికే వీరయ్యని ఇష్టపడటంతో కుటుంబం వద్దన్నా కూడా వెళ్లిపోయి రాణి పెళ్లి చేసుకుంటుంది. మొదటి మూడు నెలలు అంతా చాలా జాలీగానే నడుస్తుంది. అత్తమామలు, ఆడపడుచు అందరూ ఎంతో ప్రేమగా రాణిని చూసుకుంటారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. రాణిపై అత్త పెత్తనం, ఆడపడుచు సాధింపులు మొదలవుతాయి. హోటల్‌లో గల్లా పెట్టె దగ్గర రాణి కూర్చోవడంతో మొదలైన గొడవ చివరికి వీరయ్య.. రాణి అన్నయ్య గల్లాలు పట్టుకొని కొట్టునే వరకూ వెళ్తుంది. ఇద్దరూ విడిపోవడానికి డైవర్స్ నోటీసులు పంపేవరకూ వెళ్తుంది. మరి అంతలా గొడవ ఏం జరిగింది? వీరయ్య-రాణి జీవితంలో గొడవలు రావడానికి కారణాలేంటి? అసలు వీళ్లు విడిపోయారా? లేక కలిసారా? అనేదే మిగిలిన కథ.ఇక ఈ సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఒక్క చిన్న డైలాగ్ చెప్పాల్సిందే. "ప్రేమలో గొడవలు ఉంటాయి.. నిజానికి ఆ గొడవలోనూ ప్రేమ ఉంటుంది" . భార్యభర్తలు గొడవ పడుతున్నారంటే వాళ్ల మధ్య ప్రేమలేదని కాదు.. వాళ్లు గొడవ పడేదే ఆ ప్రేమ కోసం అని అర్థం. అయితే మొగుడు పెళ్లాల గొడవలో ఎప్పుడైతే మూడో వ్యక్తి దూరతాడో.. అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు.. మొత్తం ప్రపంచమే కావచ్చు.. అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. అవి సమస్యలు అనే కంటే నరకం అని చెప్పడం కరెక్టేమో. ఎందుకంటే స్వర్గం-నరకం అనేవి ఎక్కడో ఉండవు.. నీ ఇంట్లో ప్రశాంతత ఉంటే అదే స్వర్గం.. ప్రళయం ఉంటే అదే నరకం.అందుకే ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి ఏదో కథ చూస్తున్నట్లుగా అనిపించదు.. వాడి జీవితమే తెరపై చూస్తున్నట్లుగా ఉంటుంది. హీరోని వాళ్ల అమ్మ తిడుతున్నప్పుడో.. పెళ్లాన్ని హీరో కాకాపడుతున్నప్పుడో.. తల్లికి-పెళ్లానికి మధ్య నలిగిపోతున్నప్పుడో.. ఎవరివైపు నిల్చోవాలో తెలీనప్పుడో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి మగాడు ఈ సినిమాకి కనెక్ట్ అవుతాడు.. తెరపై హీరోలో వాడ్ని చూసి నవ్వుకుంటాడు.. కన్నీళ్లు పెట్టుకుంటాడు.. చివరికి జీవితం అంటే ఇంతే అని తెలుసుకుంటాడు. అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఇక సినిమా మొదలైనప్పుడు స్టోరీలోకి ప్రేక్షకుడ్ని దించడానికి కాస్త సమయం తీసుకున్నాడు డైరెక్టర్. అలానే అక్కడక్కడా కొన్ని సీన్లు సాగదీతగా అనిపించొచ్చు కానీ వాటిని యోగి బాబు కామెడీతో కవర్ చేశారు.మేడమ్ 'సార్' మేడమ్ అంతేఇలాంటి ఒక కథని డైరెక్టర్ పేపర్ మీద పెట్టినప్పుడు ఇందులో ఏముంది అనిపిస్తుంది. అదే కథని తీసేటప్పుడే దాని అసలు ఛాలెంజ్ ఉంటుంది. అందుకేనేమో డైరెక్టర్ పాండిరాజ్ చాలా తెలివిగా విజయ్ సేతుపతి-నిత్యా మీనన్ లాంటి యాక్టర్స్‌ని ఎంచుకున్నాడు. వీళ్లు ఈ సినిమాలో నటించారని ఎక్కడా అనిపించదు. సింపుల్‌గా చెప్పాలంటే తెరపై అసలు నిత్య-విజయ్ కనిపించరు.. ఆకాశవీరయ్య-మహారాణి మాత్రమే కనిపిస్తారు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. విజయ్ సేతుపతి పెళ్లాన్ని బతిమాలే సీన్లు, తల్లికి నచ్చజెప్పే సందర్భాలు, నీ కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదే.. అంటూ కాళ్ల మీద పడే సీన్ ఇలా ప్రతి సన్నివేశంలో విజయ్ చాలా సహజంగా నటిస్తూ తనదైన మార్క్ చూపించారు. నిత్య కూడా విజయ్‌కి పోటాపోటీగా నటించింది. అలిగేటప్పుడు, కోపపడేటప్పుడు, మొగుడ్ని కొట్టేటప్పుడు, అత్తింటి వాళ్లతో గొడవపడేటప్పుడు ప్రతి సీన్‌లోనూ చాలా బాగా నటించింది. ముఖ్యంగా డైవర్స్‌‍కి సంబంధించిన నోటీసులపై సైన్ చేసే సీనులో, తన కాపురం చక్కబడాలని విజయ్ బిచ్చగాడిలా అడుక్కునే సీన్, ప్రీ క్లైమాక్స్‌లో భార్య-భర్తల గురించి చెప్పే డైలాగ్స్‌లో విజయ్ ఏడిపించేశారు. భర్త తన కోసం వస్తాడని వేయి కళ్లతో ఆశగా.. బరువెక్కిన గుండెతో బాధగ ఎదురుచూసే భార్యగా నిత్య మీనన్ కూడా గుండెల్ని పిండేసింది. ఇక యోగి బాబు, కాళి వెంకట్, వినోజ్ జోస్, శరవణన్, రోషిని దీప శంకర్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో భలే ఒదిగిపోయారు. ముఖ్యంగా విజయ్ తల్లిగా చేసిన ఆవిడ గొడవ సీన్‌లలో చించిపారేసింది. మొత్తానికి యాక్టర్స్ అందరూ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షుకలకి అందించడానికి పూర్తి న్యాయం చేశారు. డైరెక్టర్ తను అనుకున్న కథని నూటికి నూరి శాతం తెరపై చూపించగలిగాడు. సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సరిగ్గా సరిపోయింది. ఒక చిన్న మనస్పర్థని, చిన్న గొడవని కుటుంబ సభ్యులు, చుట్టాలు తమకి తెలీకుండానే ఎంత పెద్దవిగా మార్చేస్తారు.. ఆఖరికి భార్యభర్తలు విడిపోయేలా చేస్తారు అనే విషయాన్ని కళ్లకి కట్టినట్లు చూపించారు. సినిమా ప్రీ క్లైమాక్స్ ప్రేక్షుకుల్ని ఏడిపిస్తే క్లైమాక్స్ మత్రం ఒక సంతృప్తిని ఇస్తుంది. అయితే థియేటర్‌ నుంచి బయటికి వచ్చే ముందు మాత్రం ఇదే కదా మ్యారేజ్ లైఫ్ అనుకొని ఒక చిన్న నవ్వు మాత్రం వస్తుంది. "భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైంది, అందమైంది. కానీ దాన్ని నిలుపుకొనేందుకు పడే పాట్లున్నాయే వామ్మో ప్రాణం పోతోంది" ఇది ఈ సినిమాలో డైలాగ్.. నిజమే సుమా!!ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఓ సకుటుంబ సపరివార 'సిత్రం'.. కాదు జీవితం!