భారత్‌కు భయపడ్డ ట్రంప్? అందుకే టారిఫ్స్‌తో రెచ్చగొడుతున్నారా? ఈ కవ్వింపు చర్యలను ఎలా చూడాలి?

Wait 5 sec.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2024 ఎన్నికల్లో గెలిచి పదవి చేపట్టింది మొదలు.. అనేక అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ బెంబేలెత్తిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగేన్- మాగా నినాదంతో.. ప్రపంచ దేశాలను వాణిజ్యం పేరుతో భయపెడుతున్నారు. అలాగే భారత్‌తో వ్యవహరించే ప్రయత్నం చేశారు. భారత్ తన దారికి రాకపోవడంతో.. టారిఫ్స్, పెనాల్టీలు విధిస్తానంటూ బుధవారం (జులై 30న) వాణిజ్య యుద్ధానికి తెరలేపారు! ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? భారత్‌కు భయపడే ఇదంతా చేస్తున్నారా? ఈ చర్యలను ఎలా చూడాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్‌పై 26 శాతం విధిస్తానని అప్పుడు చెప్పారు. ఆ తర్వాత టారిఫ్స్ విధించే నిర్ణయాన్ని 90రోజుల పాటు ఆపేశారు. ఈ క్రమంలో భారత్ - అమెరికా మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేశాయి. అయితే ఎంతకూ చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో, అసహనానికి గురైన ట్రంప్!.. బుధవారం (జులై 30న) ఇండియాపై టారిఫ్ బాంబ్ పేల్చారు. 25 శాతం అదనపు సుంకాలతో పాటు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు పెనాల్టీ విధిస్తానని బెదిరింపులకు దిగారు. దీంతో భారత్ - అమెరికా వాణిజ్య సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ట్రంప్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?ఇంతకుముందున్న అగ్రరాజ్య అధినేతలతో పోలిస్తే.. ట్రంప్‌ చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మాటలు, చేతలు కూడా అలాగే ఉన్నాయి. ట్రంప్ తన 'ట్రంపరి' చేష్టల వల్ల చాలా సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఓసారి నేనే పోప్ అయితా అంటారు, పోప్ అంత్యక్రియల్లో అందరూ నల్ల సూట్ ధరిస్తే.. ఈయన బ్లూసూట్‌ వేసుకొచ్చారు. ఎలాన్ మస్క్‌ను అనూహ్యంగా డోజ్ అధిపతి చేసి.. మళ్లీ ఆయనతో కయ్యానికి కాలుదువ్వారు. ఇమ్మిగ్రంట్లను బలవంతంగా స్వదేశాలకు పంపడం, వాళ్లను సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపి ఆ దేశాలను రెచ్చగొట్టడం, ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీపై అందరిముందే అరవడం.. భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అనేక సార్లు గొప్పలు చెప్పుకోవడం.. ఒకటా రెండా.. గడిచిన ఆరు మాసాల్లోనే ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. ట్రంప్ అధ్యక్షుడిగా అమెరికాలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది అన్న కొలంబియా యూనివర్సిటీ లా ప్రొఫెసర్ డేవిడ్ పోజెన్ మాటల్లో నిజం ఉందేమో అనే భావన వస్తోంది. ఈయన ప్రమాణ స్వీకారం చేశాక.. నియంతృత్వ పాలనలోకి అమెరికా జారుకుంది.. అని యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా పొలిటికల్ సైంటిస్ట్ డానియెల్ స్టాకెమర్ అన్న మాటలు సరైనవేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అంతేకాకుండా వాణిజ్యం విషయంలో ట్రంప్ ప్రవర్తనకు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత్ విధించే టారిఫ్‌లు.. అమెరికా ఎగుమతిదారులకు అడ్డంకిగా ఉన్నాయని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే భారత్‌తో ఇంతవరకు తక్కువ వాణిజ్యం చేశామని చెబుతున్నారు. ఎంతకూ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో.. డీల్ నెగోషియేషన్ (ఒప్పంద చర్చల వ్యూహం) టాక్టిక్‌లో భాగంగా టారిఫ్ విధిస్తానంటూ భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అలా అయితే భారత్ తన మార్కెట్‌ మరింత తెరుస్తుందని, తక్కువ టారిఫ్‌లు విధిస్తుందని అమెరికా భావిస్తోంది. ఇక ఇండియాతో వాణిజ్య లోటు (US India trade deficit) ఉండటం, చర్చలు కూడా నెమ్మదిగా సాగుతుండటంతో అసహనానికి గురైన ట్రంప్.. టారిఫ్స్‌ విధిస్తానంటూ ఒత్తిడి తెస్తున్నారని విశ్లేషకుల అంటున్నారు. భారత్‌పై టారిఫ్స్‌ను రష్యాకు లింక్ చేస్తూ ట్రంప్.. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రష్యాను ఒంటరిని చేయాలని అమెరికా ఎప్పటినుంచో పరితపిస్తోంది. అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధా్న్ని బూచిగా చూపి.. రష్యాపై ఆంక్షలతో ముప్పేట దాడి చేస్తోంది. తన పశ్చిమ స్నేహితులను కూడా రష్యాపైకి ఉసిగొల్పుతోంది. ఈ క్రమంలో భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి అండగా నిలుస్తోంది. ఇది ట్రంప్‌నకు రుచించడం లేదు. అందుకే రష్యా నుంచి చమురు కొంటే పెనాల్టీ వేస్తానంటున్నారు. భారత్‌కు భయపడే ఇదంతా చేస్తున్నారా?టారిఫ్స్‌ను.. భయం కంటే నెగోషియేషన్ టాక్టిక్స్‌గా, ఆవేశపూరితమైన వాణిజ్యం దౌత్యం వ్యూహంగా చాలా మంది నిపుణులు చూస్తున్నారు. అయితే కేవలం భారత్‌ మాత్రమే కాకుండా.. బ్రిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న గ్రూప్‌లు.. ప్రపంచంపై తమ ఆధిపత్యానికి గండికొడుతాయన్న భయం అమెరికాకు ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే తాజాగా బ్రిక్స్‌ను.. అమెరికా, డాలర్‌కు వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. అందులో భారత్‌ ఒకటన్న ట్రంప్.. అందుకే టారిఫ్స్ విధిస్తున్నామని చెప్పారు. డాలర్‌కు ఎదురొచ్చే ఎవరినీ వదిలిపెట్టం అన్నారు. తమతో ఉంటూనే బ్రిక్స్‌లో భారత్ సభ్యత్వం కలిగి ఉండటం, రష్యాతో స్నేహం, గ్లోబల్ సౌత్‌ వాయిస్‌ను ప్రపంచ వేదికలపై వినిపించడం, చైనాతో వాణిజ్యం, అమెరికాలో భారతీయుల ప్రభావం, ఉద్యోగాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలు.. అమెరికాను ఇబ్బందికి గురిచేస్తున్నాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే అమెరికా దౌత్యవేత్త, రాజకీయ శాస్త్రవేత్త హెన్రీ కిస్సింజర్ చెప్పినట్లు.. అమెరికాకు శాశ్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉండరనే విషయం తెలిసినా.. తన ఆధిపత్యం ఎక్కడ అంతమవుతుందో అనే భయం అమెరికాను వెంటాడుతోందని చెబుతున్నారు. అందుకే ఇటీవల అమెరికా టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ట్రంప్‌కు ఎంత ధైర్యం?వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలకు కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాల్లో టారిఫ్‌లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే చవకైన, రాయితీ ఇచ్చిన.. అమెరికా డెయిరీ, వ్యవసాయ వస్తువులను టారిఫ్ లేకుండా భారత్‌ మార్కెట్లోకి అనుమతి ఇస్తే.. 700 మిలియన్ల మంది ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డెయిరీ రంగంపై ఆదారపడి ఉన్న దాదాపు 8 కోట్ల మంది రైతు భవిష్యత్తుకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతోంది. ఇంతేకాకుండా, జెనెటికల్‌గా మోడిఫై చేసిన కార్న్, సోయబీన్, డెయిరీ వస్తువులపై టారిఫ్‌లు తగ్గించడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. అమెరికాలో ఆవులకు మాంసం, రక్తం, పౌల్ట్రీల నుంచి వచ్చిన చెత్త మేతగా వేస్తారు. వీటి నుంచి వచ్చిన పాలను నాన్- వెజిటేరియన్ మిల్క్‌గా వ్యవహరిస్తారు. ఇక భారత్‌లో ఎక్కువగా శాఖాహారులు ఉండటం వల్ల.. ఇలాంటి పదార్థాల దిగుమతిని వ్యతిరేకిస్తోంది. మతపరమైన కారణాలు తెలిపినా వీటిని భారత్‌కు ఎగుమతి చేయాలని భావిస్తున్న ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమపై ఇష్టం లేని వాటిని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు ఎంత ధైర్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం..అమెరికా.. భారత్‌కు అతిపెద్ద మార్కెట్. 2024లో భారత్ 87 బిలియన్ డాలర్లకు పైగా విలువైన వస్తువులు అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఒకవేళ ట్రంప్ 25 శాతం సుంకాలు విధిస్తే.. ఇప్పుడు ఆయా వస్తువులపై అమెరికా వసూలు చేస్తున్న టారిఫ్‌లకు అదనం అవుతుంది. అంటే ఇప్పుడు టెక్స్‌టైల్స్‌పై అమెరికా 12 శాతం టారిఫ్ విధిస్తోంది. కొత్త సుంకాలు అమలులోకి వస్తే అది.. 12% + 25% + పెనాల్టీ అదనం అవుతాయి. కొత్త టారిఫ్‌ల వల్ల టెక్స్‌టైల్స్, వజ్రాలు - ఆభరణాలు, ఆటోమొబైల్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 17 శాతం. భారత్ జీడీపీలో అది 2.2 శాతం. కాబట్టి అమెరికాకు ఎగుమతులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఇండియా జీడీపీ వృద్ధి 0.2 - 0.5 మేర కోతపడే ప్రమాదం ఉంది. అదనపు పెనాల్టీల వల్ల ట్రేడ్ ఇంబాలన్స్, వ్యూహాత్మకంగా ఆందోళనలకు దారితీస్తుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం పడుతుంది. కేవలం భారత్ మాత్రమే కాదు 90 దేశాలపైనా.. ఏకపక్ష వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. అధిక రాయితీ గల అమెరికా వస్తువులకు మార్కెట్ ఓపెన్ చేసి.. భారత వ్యవసాయ, పౌల్ట్రీ రంగాలను ఇండియా రిస్క్‌లో పెట్టలేదు. ఇంకా చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది. కానీ అందులో దేశ ప్రయోజనాలే ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు ఈ ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరుపుతూ.. దేశ ప్రయోజనాలను కాపాడుతున్న అధికారుల పనితీరు అభినందనీయం.