Bank Charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహిస్తున్నారా? లేదంటే ఛార్జీలు పడతాయనే ఆందోళనలో ఉన్నారా? అయితే, ఈ కథనం మీరు చదవాల్సిందే. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మరో ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఖాతాలో కనీస సగటు నెలవారీ నగదు నిల్వ ఛార్జీలను మాఫీ చేశాయి. తాజాగా ఈ జాబితాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) చేరింది. సెప్టెంబర్ త్రైమాసికం నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడాదేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) సైతం కొద్ది రోజుల క్రితమే సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహణ ఛార్జీలను ఎత్తి వేసింది. జూలై 1, 2025 నుంచే ఈ రూల్స్ అమలు చేస్తోంది. పొదుపు ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా ఇకపై ఎలాంటి ఛార్జీలు పడవు. అయితే, ప్రీమియం సేవింగ్స్ అకౌంట్ పథకాలకు వర్తించదని తెలిపింది. ఇండియన్ బ్యాంక్అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకుంటే విధించే ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవలే తెలిపింది. ఇప్పుడు జీరోనే హీరో అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేపట్టింది. ఈ కొత్త రూల్స్ జూలై 2, 2025 నుంచే అమలు చేస్తోంది. కెనరా బ్యాంక్..ఈ ప్రభుత్వ బ్యాంక్ ఈ ఏడాది మే, 2025లోనే సేవింగ్స్ అకౌంట్లలోని సగటు నెలవారీ నగదు నిల్వ ఛార్జీలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకూ వర్తిస్తుందని తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ చాలా కాలంగా మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను అమలు చేయడం లేదు. అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లపై కనీస నగదు నిల్వ ఛార్జీలను 2020 నుంచే ఎత్తివేసింది. కనీస బ్యాలెన్స్ నిల్వ లేకుంటే ఛార్జీలు విధించడం లేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియాసేవింగ్స్ అకౌంట్లలో కనీస నగదు నిల్వ లేకుంటే విధించే ఛార్జీలను బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) సైతం మాఫీ చేసింది. ఈ మార్పులు మార్కెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా, ఆర్థిక సరళతను పెంపొందించడానికి, అన్ని విభాగాలలోని కస్టమర్లకు ఎక్కువ విలువను అందించడానికి ఉద్దేశించినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.