కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్‌కోచ్ పదవికి చంద్రకాంత్ పండిట్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన పదవి నుంచి తప్పుకున్నట్లు కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మంగళవారం (జూలై 29)న అధికారకంగా వెల్లడించింది. 2022 ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత చంద్రకాంత్.. కేకేఆర్ హెడ్‌ కోచ్ అయ్యారు. 2024లో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించారు.“చంద్రకాంత్ పండిట్ కొత్త అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. ఆయన ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్‌కోచ్‌గా ఉండటం లేదు. ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపినందుకు.. మెగా వేలంలో బలమైన జట్టును నిర్మించడంలో తోడ్పాటు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన నాయకత్వం, క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి” అని కేకేఆర్ తన ప్రకటనలో వెల్లడించింది. “థాంక్యూ చందూ సర్‌” అని క్యాప్షన్ ఇచ్చింది.కాగా ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత అంటే అదే ఏడాది ఆగస్టులో బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో .. కేకేఆర్ హెడ్‌కోచ్‌గా నియమితులయ్యారు. తన తొలి సీజన్‌ అయిన ఐపీఎల్ 2023లో కేకేఆర్.. ఏడో ప్లేసులో నిలిచింది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత 2024లో కేకేఆర్.. విజేతగా నిలిచింది. కానీ ఐపీఎల్ 2025లో మాత్రం నిరాశపరిచింది. 2025 సీజన్‌లో సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు బరిలోకి దిగింది. 14 మ్యాచ్‌లలో కేవలం 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో చంద్రకాంత్ పండిట్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చంద్రకాంత్ పండిట్ హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు కేకేఆర్.. 3 సీజన్లలో 42 మ్యాచ్‌లు ఆడింది. అందులో 22 మ్యాచ్‌ల్లో గెలిచి, 18 మ్యాచ్‌ల్లో ఓడింది. 2 మ్యాచ్‌లలో మాత్రం ఫలితం రాలేదు. మరి కేకేఆర్ కొత్త కోచ్‌గా ఎవరు వస్తారనేది తెలియాల్సి ఉంది. గత సీజన్‌కు ముందు.. మెంటార్‌ గంభీర్ సైతం జట్టును వీడాడు. టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.