ఇంగ్లండ్‌ను గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమవ్వగా.. ఓవల్ టెస్టు మిగతా మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఓవల్ టెస్టు మొదటి రోజు గాయపడిన వోక్స్.. మిగతా నాలుగు రోజుల మ్యాచ్‌కు దూరం అవుతున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది."భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు ఎడమ భుజానికి గాయమైంది. ఆ గాయం కారణంగా అతను మిగతా మ్యాచ్‌లో పాల్గొనడం అసాధ్యమని తేలింది. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. టెస్టు ముగిసిన తర్వాత వోక్స్‌కి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తాము" అంటూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి రోజు బౌండరీకి వెళ్తున్న బంతిని ఆపే ప్రయత్నంలో క్రిస్ వోక్స్‌కి గాయమైంది. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా ఉండటంతో బంతిని ఆపే ప్రయత్నంలో వోక్స్ జారి కిందపడ్డాడు. ఆ సమయంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. ప్రథమ చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అతను గ్రౌండ్‌ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ది ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 14 ఓవర్లు వేసిన వోక్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. కేఎల్ రాహుల్‌ను బౌల్డ్ చేసి టీమిండియాను భారీ స్కోర్ చేయకుండా చేశాడు. ఓవరాల్‌గా ఈ టెస్టులో తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడిన వోక్స్ 11 వికెట్లు తీసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన భారత జట్టు బ్యాటర్లు ఇంగ్లండ్ పేస్ ధాటికి క్రీజులో ఎక్కువ సేపు నిలుచోలేకపోయారు. కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ గౌరవప్రధమైన స్కోర్ చేయగలిగింది. తొలి రోజు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఆలౌట్ అయింది. రెండో రోజు కేవలం 20 పరుగులే చేసిన టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ అయింది. గస్ అటిక్‌సన్ ఐదు వికెట్లు తీసుకోగా.. జోష్ టంగ్ మూడు వికెట్లు పడగొట్టాడు.