Bengaluru: రూ.15 వేల జీతగాడికి కళ్లుచెదిరే ఆస్తులు.. 24 సొంతిళ్లు.. 40 ఎకరాల భూమి!

Wait 5 sec.

నెలకు రూ.15 వేలు జీతం అంటే.. ఎంతో పొదుపుగా ఖర్చు చేస్తే తప్ప వందో రెండొందలు మిగలడం కష్టం. కానీ, ప్రభుత్వ శాఖలో ఓ జూనియర్ క్లర్క్ నెలకు రూ.15 వేలు జీతంతో కోట్ల కూడబెట్టాడు. అవును మీరు వింటోంది నిజమే. అతడి పేరుతో పదుల సంఖ్యలో ఇళ్లు, ఎకరాలకొద్దీ భూములు సంపాదించాడు. ఆదాయంతో పొంతన లేని ఆస్తులు కూడగట్టుకున్న అతడి గుట్టురట్టయ్యింది. కర్ణాటక గ్రామీణ మౌలికసౌకర్యాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో పనిచేసిన మాజీ క్లర్క్‌ కళకప్ప నిడగుండి నివాసంలో శుక్రవారం లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహించడంతో భారీ ఎత్తున ఆస్తులు వెలుగుచూశాయి. ఏకంగా రూ. 30 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించారు.కొప్పళ్లలో జూనియర్ క్లర్క్‌గా పనిచేసిన కళకప్ప నెల జీతం రూ. 15,000 మాత్రమే. కానీ అతడి పేరు మీద 24 ఇళ్లు, నాలుగు ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిసి అధికారులు విస్తుపోయారు. అలాగే నాలుగు వాహనాలు, 350 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులన్నీ కళకప్ప, అతడి భార్య, ఆమె సోదరుడి పేరిట ఉన్నాయి. కళకప్ప, మాజీ ఇంజినీర్ జేఎం చించోల్కర్‌తో కలిసి 96 ప్రాజెక్టులకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు రూ. 72 కోట్ల ప్రజాధనం దారి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. నివాసాల్లో అధికారులు వరుసగా దాడులు సాగిస్తున్నారు. మంగళవారం హాసన్, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, బెంగళూరు ప్రాంతాల్లో ఐదుగురు అధికారులపై దాడులు చేపట్టారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) హసన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్ జయణ్ణ. గ్రామీణ తాగునీటి విభాగం (చిక్కబళ్లాపుర) జేఈ అంజనేయమూర్తి; చిత్రదుర్గ ఆరోఘ్య అధికారి డాక్టర్ వెంకటేశ్, రెవెన్యూ ఆఫీసర్ (బీబీఎంపీ-దసరహల్లి) ఎన్వీ వెంకటేశ్, ఉద్యాన శాఖ డైరెక్టరేట్‌ సీనియర్ అసిస్టెంట్ కే. ఓం. ప్రకాష్ నివాసాల్లో రూ.25 కోట్ల మేర ఆస్తులు గుర్తించారు.జూలై 23న నిర్వహించిబెంగళూరు అర్బన్, మైసూరు, తుమకూరు, కలబురిగి, కోప్పళ్, కొడుగు జిల్లాల్లోని 41 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ప్రస్తుతం కర్ణాటక రైలు మౌలిక సదుపాయాల డెవలప్‌మెంట్ సంస్థ (కే-రైడ్) ప్రత్యేక డిప్యూటీ కమిషనర్ ఐఏఎస్ అధికారిణి వసంతి అమర్ బీవీకి చెందిన ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, రూ. 9.03 కోట్ల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో మూడు ప్లాట్లు, నాలుగు ఇళ్లు, మూడు ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 12 లక్షల నగలు, రూ. 90 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి.