గత 21 నెలలుగా గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భార్య సమర్ మహమ్మద్ అబూ జమర్ గాజా నుంచి పారిపోయి ప్రస్తుతం టర్కీలో వేరే జీవితం గడుపుతోందని ఇజ్రాయెల్ మీడియా సంస్థ వైనెట్ సంచలన నివేదిక వెలువరించింది. గతేడాది అక్టోబర్ 16న ఇజ్రాయెల్ సైన్యం యహ్వా సిన్వార్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే. గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి సమర్ జమర్ థియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె నకిలీ పాస్‌పోర్టు సహాయంతో తన పిల్లలను తీసుకుని రఫా సరిహద్దుల నుంచి ఈజిప్టుకి, అక్కడి నుంచి టర్కీకి చేరిందని సమాచారం. ‘‘ఆమె ఇక్కడ (గాజా) లేదు – టర్కీలో పిల్లలతో కలసి ఉంది.. భారీ మొత్తంలో డబ్బు, హైలెవల్ సహకారం లేకుంటే ఇది సాధ్యం కాదు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సిన్వార్ మరణం తరువాత మరో మహిళ పేరున నకిలీ పాస్ట్‌పోర్ట్‌తో గాజా నుంచి టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్నారని నివేదిక పేర్కొంది. హమాస్ రాజకీయ విభాగం నేత ఫాతీ హమ్మాద్ ఆమె గాజా దాటేందుకు ఏర్పాటు చేశాడని తెలిపింది. హమ్మాద్ ఇప్పటికే హమాస్ నేతల కుటుంబాలను గాజా నుంచి తరలించే ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి.వైనెట్ నివేదక ప్రకారం.. హమాస్ వర్గాలు 2023 చివరిలోనే తమ కీలక నేతల కుటుంబాలను గాజా నుంచి తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థను నిర్మించాయి. ఇందుకోసం నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులు, ప్రత్యేక వాహనాలు వాడతారని పేర్కొంది. భార్య నజ్వా కూడా ఇదే మార్గంలో గాజా నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్ దళాలు 2024 అక్టోబరు 16న రఫా నగరంలోని తాల్ అల్-సుల్తాన్ అనే ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న సమయంలో శిథిలమైన భవనంలో గాయాలతో ఉన్న సిన్వార్‌ను డ్రోన్ ద్వారా గుర్తించారు. ఈ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) విడుదల చేసింది. ఒక కుర్చీలో కూర్చొన్న సిన్వర్.. కర్రను డ్రోన్ మీదకు విసిరిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అనంతరం జరిపిన కాల్పుల్లో తలపై బుల్లెట్ తగిలి సిన్వార్ మరణించాడు. కాగా, గత 21 నెలలుగా ఇజ్రాయెల్ దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటి వరకూ 58 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల ప్రకారం గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. శిశువులు సహా 111 మంది ఆకలితో మరణించారు. అలాగే, సాయం కోసం వచ్చిన వారిలో 1,060 మంది దాడుల్లో మృతిచెందగా.. 7,200 మందికిపైగా గాయపడ్డారు. 71 వేల మంది బాలలు, 17 వేల మంది గర్భిణీ/ తల్లులు అత్యవసర పోషణ అవసరంలో ఉన్నారు.