అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు టీచర్ కర్కశంగా వ్యవహరించారు. స్కేలుతో కొట్టడంతో ఆ బాలికకు గాయాలయ్యాయి. ఇంటికి వచ్చిన చిన్నారికి గాయాలైన విషయం గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు స్కూలు వద్దకు చేరుకున్నారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించిన టీచర్‌‍ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్కూలు టీచర్ చిన్నారిని స్కేలుతో చితకబాదినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూలు టీచర్ కొట్టడంతో చిన్నారి తలకు కూడా గాయాలైనట్లు చెప్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఘటనకు కారణమైన టీచర్‌తో పాటుగా.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు స్కూలు ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన సమయంలో ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ అటుగా వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్కూలు వద్దకు చేరుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులతో చర్చించారు. అలాగే పాఠశాల యాజమాన్యం, స్కూలు టీచర్‌తోనూ మాట్లాడి ఆందోళనను సద్దుమణిగేలా చేశారు. అయితే చిన్నారిని గాయపరిచిన విషయంపై అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.మరోవైపు నాలుగేళ్ల చిన్నారికి అమాయకత్వం, ఆటపాటలు తప్ప వేరేవి తెలియవని.. అలాంటి చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పసిపిల్లల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన టీచర్.. వారిని ఆడించి, లాలించాల్సింది పోయి ఇలా కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చదువు చెప్పటమంటే శిక్షించడం కాదని.. ఒద్దికగా, పద్ధతిగా నేర్పించడమని సూచిస్తున్నారు. అంతర్ జిల్లా దొంగ అరెస్ట్..నిడదవోలు పోలీసులు అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేశారు. ఉండ్రాజవరంలోని కరుటూరి వెంకటరత్నం అనే వ్యక్తి ఇంట్లో డిసెంబర్ 10న చోరీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దీని వెనుక అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలోని గొంటివారిపాలెనికి చెందిన సన్యాసిరావు అనే వ్యక్తి హస్తం ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం రాజమండ్రిలో వారంపూడి జంక్షన్ వద్ద అతనిని అరెస్టు చేశారు. సన్యాసిరావు వద్ద నుంచి 253 గ్రాముల బంగారంతో పాటుగా.. 250 గ్రాములు వెండి, మూడున్నర లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.