వెనిజులా రాజధాని కారకాస్‌‌ భారీ పేలుళ్ల శబ్దాలతో ఉలిక్కిపడింది. తమ భవంతుల మీదుగా యుద్ధవిమానాలు ప్రయాణించడంతో నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఇది జరిగిన కొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. వెనిజులాలో భారీ ఎత్తున సైనిక చర్యలు జరిగాయని, ఇది డ్రగ్స్, వలసలు, జాతీయ భద్రత కోసమేనని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ చర్య అమెరికా, వెనిజులా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది.అమెరికా దాడికి కారణం ఏంటి?అమెరికా ఈ దాడికి వలసలు, డ్రగ్స్, ‘నార్కో-టెర్రరిజం’ కారణాలని పేర్కొంది. అమెరికా దక్షిణ సరిహద్దుకు వందలాది మంది వలస వస్తున్నారని, దీనికి మదురో ప్రభుత్వమే కారణమని ట్రంప్ తరుచూ ఆరోపిస్తున్నారు. నివేదికల ప్రకారం.. వెనుజులాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, రాజకీయ అణచివేతతో 2013 నుంచి 8 మిలియన్ల మంది ప్రజలు దేశం వీడి లాటిన్ అమెరికాకు వలసపోయారు. అయితే, వెనిజులా జైళ్లు, మానసిక వైద్యశాలల నుంచి ఖైదీలను మదురో విడుదల చేసి అమెరికాకు పంపుతున్నారని ట్రంప్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను వెనిజులా ప్రభుత్వం ఖండించింది.రెండోది డ్రగ్స్. డ్రగ్స్ విషయంలో కూడా అమెరికా వెనిజులాను నిందిస్తోంది. కొకైన్ రవాణాకు వెనిజులా ప్రధాన మార్గమని, అమెరికాలో ఫెంటానిల్ సంక్షోభానికి కారణమని ఆరోపించారు. ‘ట్రెన్ డి అర్గువా’, ‘కార్టెల్ డి లాస్ సోల్స్’ అనే రెండు వెనిజులా నేర సంస్థలను అమెరికా విదేశీ తీవ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ‘కార్టెల్ డి లాస్ సోల్స్’ ను మదురోనే నడుపుతున్నారని ట్రంప్ ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే, డ్రగ్స్‌పై యుద్ధం పేరుతో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా ఆయుధంగా వాడుకుంటోందని వెనిజులా ఆరోపించింది.కారకాస్‌‌పై దాడులు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా బలగాలు మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం నుంచి తరలించాయని ట్రంప్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా భద్రతా బలగాలు కూడా పాల్గొన్నాయని తెలిపారు. పూర్తి వివరాలను మార్ ఎ లాగోలో నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడిస్తానని చెప్పారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైన్యం ప్లానింగ్, ఆపరేషన్‌పై ప్రశంసలు కురిపించారు.కొన్ని నెలలుగా అమెరికా, వెనుజులా మధ్య ఉద్రిక్తతలుగత కొన్ని నెలలుగా వెనిజులాపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. కరేబియన్‌ దేశంలో అమెరికా నౌక, వైమానిక దళాలను భారీగా మోహరించింది. డ్రగ్స్ రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ గతేడాది సెప్టెంబరు నుంచి చిన్న పడవలను టార్గెట్ చేస్తూ జరిపిన వివిధ దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్లు అమెరికా అంగీకరించింది. డ్రగ్స్ పడవలు ఉపయోగించే ఓడరేవును ధ్వంసం చేశామని ట్రంప్ తెలిపారు. తాము డ్రగ్స్ కార్టెల్స్‌తో యుద్ధం చేస్తున్నామని అమెరికా చెబుతోంది.అయితే, అమెరికా ఆరోపిస్తున్నట్టు తాము డ్రగ్స్‌ రవాణా చేయడం లేదని, దేశంలోని చమురును దక్కించుకోవడానికే అమెరికా తనను అంతం చేయాలని చూస్తోందని మదురో ఆరోపించారు. దాడికి కొద్ది రోజుల ముందే డ్రగ్స్ రవాణా, వలసలపై సహకారం అందిస్తామని తాము ప్రతిపాదనలు చేశామని ఆయన గుర్తు చేశారు.