ఆ ఉత్తర్వుల రద్దు.. న్యూయార్క్ మేయర్ మామ్దానీ‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

Wait 5 sec.

న్యూయార్క్ నూతన మేయర్‌గా జనవరి 1న బాధ్యతలు చేపట్టిన వెంటనే వెలువరించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు సంచలనంగా మారాయి. మాజీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇజ్రాయెల్‌కు అనుకూలంగా తీసుకొచ్చిన ఉత్తర్వులను ఆయన రద్దుచేశారు. దీంతో ఆ దేశం తీవ్రంగా స్పందించింది. న్యూయార్క్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే మమ్దానీ తన నిజస్వరూపం బయటపెట్టారని, యూదు వ్యతిరేక నిర్వచనాన్ని రద్దుచేసి ఇజ్రాయెల్‌‌కు వ్యతిరేక ఆందోళలపై ఆంక్షలు ఎత్తివేశారని ఆ దేశ విదేశాంగ శాఖ దుయ్యబట్టింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.. ‘‘ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు: ఆయన IHRA (ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ అలయన్స్) యూదు వ్యతిరేక నిర్వచనాన్ని కొట్టివేసి, ఇజ్రాయెల్‌ను బహిష్కరించడంపై ఆంక్షలను ఎత్తివేశారు’’ అని పేర్కొంది. మమ్దానీ చర్య నాయకత్వం కాదని, అది కేవలం యూదు వ్యతిరేకతపై పెట్రోల్ పోయడం లాంటిదని ఆరోపించింది.మాజీ మేయర్ ఆడమ్ ఆదేశాలను రద్దు చేశారు. ఆ ఆదేశాలు నగర సంస్థలు నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా నిరోధించాయి.. హోలోకాస్ట్ విద్యను ప్రోత్సహించే 25 దేశాల సంస్థ అయిన ఐహెచ్ఆర్ఏ గుర్తించిన విధంగా యూదు వ్యతిరేకతకు నిర్వచనం ఇచ్చాయి. కాగా, ఈ ఉత్తర్వుల రద్దు నిర్ణయాన్ని మమ్దానీ సమర్దించుకున్నారు. న్యూయార్క్‌లో పలు యూదు సమూహాలు యూదు వ్యతిరేకతకు సంబంధించిన విస్తృత నిర్వచనంపై ఆందోళన వ్యక్తం చేశాయని చెప్పారు. ‘న్యూయార్క్‌లోని యూదులను రక్షించడానికి గతంలో చేసిన వాగ్దానాలకు మా నిబద్ధతను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, మమ్దానీ నిర్ణయాన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్ స్వాగతించినట్టు రాయిటర్స్ నివేదించింది. పాలస్తీనా హక్కుల కోసం మాట్లాడేవారి గొంతు నొక్కేయడానికి ఐహెచ్ఆర్ఏ నిర్వచనం ఉపయోగపడుతుందని వాదించిన వారిలో అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఒకటి. గతేడాది నవంబరులో జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 34 ఏళ్ల మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనను ఓడించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మమ్దానీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.