ముస్తాఫిజుర్‌‌ వివాదం.. భారత్‌పై బంగ్లాదేశ్ రివేంజ్ ప్లాన్.. కొత్త డిమాండ్‌తో ఐసీసీ ముందుకు..!?

Wait 5 sec.

షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఇండియా వ్యతిరేక శక్తులు బలం పుంజుకున్న సంగతి తెలిసిందే. భారతీయుల పట్ల బంగ్లాదేశీయుల్లో వ్యతిరేకతను నూరిపోసేందుకు ఇస్లామిక్ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బంగ్లాలోని హిందువులపై హింసాత్మక దాడులు చేస్తూ.. మైనార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్‌ 2026 కోసం కోల్‌కతా నైట్ రై‌డర్స్ కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రిలీజ్ చేయాలని.. బీసీసీఐ కేకేఆర్ ఫ్రాంచైజీని ఆదేశించింది. తమ ఆటగాణ్ని ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయమని బీసీసీఐ ఆదేశించినందుకు ప్రతిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ.. తమ జట్టు ఆడబోయే టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంక‌కు తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరనుందని తెలుస్తోంది.బంగ్లాదేశ్ క్రీడా శాఖ ఈ మేరకు బీసీబీకి సూచనలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ని సంప్రదించి.. బంగ్లాదేశ్ ఆడే నాలుగు లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరాలని.. ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ బీసీబీని ఆదేశించారు. ‘క్రీడల మంత్రిత్వ శాఖ బాధ్యత వహించే సలహాదారుగా, మొత్తం విషయాన్ని లిఖితపూర్వకంగా ఐసీసీకి వివరించాలని క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సూచించాను’ అని నజ్రుల్ తన ఫేస్‌బుక్ పేజీలో బెంగాలీలో రాశారు.‘ఒక బంగ్లాదేశ్ క్రికెటర్, ఐపీఎల్ కాంట్రాక్టులో ఉన్నప్పటికీ.. భారతదేశంలో ఆడలేకపోతే.. బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఇండియాలో సురక్షితంగా వరల్డ్ కప్ ఆడుతుందని భావించలేదని బీసీబీ స్పష్టం చేయాలి. బంగ్లాదేశ్ ఆడే ప్రపంచ కప్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని అధికారికంగా అభ్యర్థించాలని కూడా నేను బోర్డుకు నిర్దేశించాను’ అని నజ్రుల్ తన పోస్టులో రాసుకొచ్చారు.బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో మూడు మ్యాచ్‌లకు కోల్‌కతా, ఒక మ్యాచ్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7 వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌తోపాటు ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌లు కోల్‌కతా వేదికగా జరిపేందుకు షెడ్యూల్ నిర్ణయించారు. బంగ్లాదేశ్ చివరి గ్రూప్ మ్యాచ్ నేపాల్‌తో ఫిబ్రవరి 17న ముంబైలో జరగనుంది.అయితే, టీ20 టోర్నమెంట్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆడబోయే వేదికలను మార్చడం అనేది దాదాపు అసాధ్యమని బీసీసీఐలోని ఓ వర్గం పేర్కొంది.‘‘ఎవరి విలాసాల కోసమో ఇప్పటికిప్పుడు వేదికలను మార్చలేరు. లాజిస్టిక్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రత్యర్థి జట్ల గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పటికే వారి కోసం విమాన టిక్కెట్లతోపాటు హోటళ్లు కూడా బుక్ అయ్యాయి. అంతేకాకుండా, గ్రూప్ దశలో ప్రతిరోజూ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. అంటే శ్రీలంకలోనూ ఒక మ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఇది చెప్పినంత సులభం కాదు’’ అని ఆ వర్గం తెలిపింది. పాకిస్థాన్ సైతం.. కొంత కాలం క్రితం బీసీసీఐతో కుదిరిన అవగాహనలో భాగంగా.. తమ ప్రపంచ కప్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనున్న సంగతి తెలిసిందే. ముస్తఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేయగానే.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. అయితే ఈ భేటీ తర్వాత బీసీబీ అధ్యక్షుడు, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్ మాత్రం ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.