డబ్బు అవసరమైనప్పుడు అవతలి వ్యక్తి కాళ్లు పట్టుకుని బతిమిలాడటం.. తీరా తీర్చే సమయం వచ్చేసరికి ముఖం చాటేయడం ఈ రోజుల్లో మనం తరచుగా చూస్తున్నాం. కొందరైతే అప్పు ఎగ్గొట్టడానికి ఐపీ (Insolvency Petition) పెట్టడం లేదా ఇచ్చిన వారితో గొడవకు దిగడం వంటివి చేస్తున్నారు. మరికొందరు అంతులేని క్రూరత్వానికి ఒడిగడుతూ.. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుత కాలంలో ఎక్కువైపోయింది. అందుకే ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఆ వ్యక్తి నిజాయితీని, నేపథ్యాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం నమ్మకంతో భారీ మొత్తంలో నగదు ఇవ్వడం ప్రమాదకరంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ కోవలోకే వస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో అప్పు ఎగ్గొట్టడం కోసం స్నేహితురాలినే అతి దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. నందిపేట సుభాష్ గల్లీకి చెందిన రాగల గంగామణి (40) అనే మహిళకు అదే గల్లీకి చెందిన గూండ్ల స్వరూప, లావణ్య .. జన్నెపల్లికి చెందిన ప్రేమలతో మంచి స్నేహం ఉంది. వీరంతా ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని స్వరూప, లావణ్య, ప్రేమల ఆమె దగ్గర పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. తీర్చడం ఇష్టం లేక నిందితులు గంగామణిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. శుక్రవారం పచ్చబొట్టు వేయించుకుందామని నమ్మబలికి ఆమెను బాసరకు తీసుకెళ్లారు. వెళ్లే దారిలో ఆమెకు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో ఆమె మెడలోని బంగారు నగలను కాజేయడానికి ప్రయత్నించగా.. గంగామణి ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు ఆమె తలపై బలమైన ఆయుధంతో కొట్టి అక్కడికక్కడే ప్రాణం తీశారు. అనంతరం మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా వాగులో పడేశారు.గంగామణి కుమార్తె మేఘన తన తల్లికి ఫోన్ చేయగా.. స్వరూప ఫోన్ ఎత్తి ‘మమ్మీకి టాటూ వేయిస్తున్నాం’ అని అబద్ధం చెప్పి నమ్మించింది. తల్లి ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి శనివారం వాగులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమల భర్త నరేష్ కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఇటువంటి దారుణ సంఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంతటి వారినైనా గుడ్డిగా నమ్మకూడదు. అప్పు ఇచ్చేటప్పుడు చట్టపరమైన పత్రాలు లేదా హామీలు ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. జెన్యూన్ గా అప్పు అడిగే వారికి కూడా ఈ అక్రమార్కుల వల్ల నష్టం జరుగుతోంది. సామాన్యులు తమ కష్టార్జితాన్ని ఇతరులకు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త వహించడం నేటి కాలంలో చాలా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.