ఉత్తరాంధ్రవాసుల కలలకు రెక్కలు రానున్నాయి. ఎన్నోరోజుల ఎదురుచూపులకు తెరపడనుంది. విజయనగరంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగనుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో రేపు (జనవరి 4) ట్రయల్‌ రన్‌లో భాగంగా విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయల్దేరనున్న ఎయిర్ ఇండియా విమానం.. ఆదివారం ఉదయం 11 గంటలకు. ఈ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ క‌లిశెట్టి అప్పల‌నాయుడుతో పాటుగా ఇత‌ర ఉన్నతాధికారులు భోగాపురంలో దిగనున్నారు. ట్రయల్ రన్ అనంతరం.. మే నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. దక్షిణ భారతదేశంలో విశాఖపట్నం.. ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. విమాన సర్వీసులు, అంతర్జాతీయ అనుసంధానం, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. ముఖ గుర్తింపు ద్వారా పేపర్ లెస్ ఎంట్రీ ఉంటుంది. అలాగే 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరోబ్రిడ్జిల ద్వారా నేరుగా విమాన ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ పవర్, వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారాల లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోంది. భోగాపురం విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు 2025 డిసెంబర్ నాటికి భోగాపురం విమానాశ్రయం పనులు సుమారుగా 91.7 శాతం పూర్తయ్యాయి. 2026 మే లేదా జూన్ నాటికి మిగతా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతోఅధికారులు పనిచేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు తొలిదశ నిర్మాణం కోసం సుమారు 4,592 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే విమానాశ్రయానికి దగ్గరలోనే 136 ఎకరాల్లోని ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయం చేరుకోవటానికి ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతాయని అధికారులు చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ సందర్శకుల రాక పెరుగుతుందని.. మొత్తంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.