వెనుజులా అధ్యక్షుడు , ఆయన భార్యను పట్టుకుని, ఆ దేశం నుంచి వెళ్లగొట్టినట్టు అమెరికా ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కారకాస్‌పై వైమానిక దాడులు చేసినట్టు ట్రంప్ ధ్రువీకరించారు. డ్రగ్స్ కార్యకలాపాలకు వెనుజులా కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ పేలుళ్లలో పలు భవనాలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడులతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ కారకస్‌లోని ఆ దేశ అతిపెద్ద సైనిక స్థావరం కూడా అంధకారంలో చిక్కుకుంది. పేలుళ్లు జరిగిన కొద్ది సేపటికే మదురోను అదుపులోకి తీసుకున్నట్టు ట్రంప్ ప్రకటన చేశారు.మిరండా, అరగ్వూ, లా గుయోరా రాష్ట్రాల్లో దాడులు జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక, అమెరికా సైన్యం దుందుడుకు చర్యలను ఖండించిన వెనుజులా.. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ‘వెనిజులా భూభాగం, ప్రజలపై ప్రస్తుత అమెరికా ప్రభుత్వం చేసిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణను అంతర్జాతీయ సమాజం ముందు వెనుజులా తిరస్కరిస్తుంది.. ఖండిస్తుంది’ అని అధ్యక్షుడు మదురో ప్రభుత్వం తెలిపింది. గతంలోనే . కారకాస్‌లో జరిగిన అనేక దాడుల వెనుక అమెరికా సైన్యం ఉందని యూఎస్ మీడియా పేర్కొంది. దాడుల్లో అమెరికా సైన్యం పాత్ర ఉందని అధికార యంత్రాంగం నిర్దారించినట్టు సీబీఎస్, ఫాక్స్ న్యూస్ నివేదించాయి. వెనుజులాలోని డ్రగ్ కార్టెల్స్‌పై భూతల దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది వారాల కిందట వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, కరేబియన్ దేశం చుట్టూ అమెరికా అత్యాధునిక యుద్ధనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఇతర యుద్ద నౌకలు సహా భారీగా నేవీ, వైమానిక దళాలను మోహరించారు. గత సెప్టెంబరు నుంచి కరేబియా, తూర్పు పసిఫిక్ సముద్రంలో డ్రగ్ స్మగ్లర్లే లక్ష్యంగా పలుదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 100 మందికిపైగా హతమవ్వగా.. వెనిజులాపై చమురు దిగ్బంధనంలో భాగంగా అమెరికా భద్రతా దళాలు సముద్రంలో రెండు ట్యాంకర్లను కూడా స్వాధీనం చేసుకున్నాయి.కాగా, డ్రగ్ కార్టెల్స్‌కు వెనుజులా అధ్యక్షుడు మదురో నాయకుడని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మదురో పదవి నుంచి వైదొలగడం తెలివైన పని అని ఆయన ఇటీవల అన్నారు. వెనిజులా నాయకుడికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యాపారంలో తన ప్రమేయం ఏమీ లేదని మదురో ఖండించారు. భూమిపైనే అత్యంత పెద్ద చమురు నిల్వలు వెనిజులాలో ఉన్నందున అమెరికా వాటిని దక్కించుకోడానికి తనను పదవి నుంచి తొలగించాలని చూస్తోందని అన్నారు.