డబ్బు పిచ్చితో మనుషులు ఎంతలా దిగజారిపోతున్నారో చెప్పడానికి మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. నోరు లేని మూగజీవాలను హింసిస్తూ.. వాటి రక్తాన్ని అమ్ముకుంటున్న ఒక ముఠా ఆగడాలు చూస్తుంటే మానవత్వం మంటగలిసిపోతోందనిపిస్తుంది. కష్టాల్లో ఉన్న మనుషులను కాపాడాల్సిన వైద్య వృత్తిని అడ్డం పెట్టుకుని.. ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్ చేసిన పని ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.అసలు ఏం జరిగిందంటే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీలో రహస్యంగా ఒక దారుణమైన దందా సాగుతోంది. స్థానిక మటన్ షాపు యజమాని. ఒక నకిలీ పశువైద్యుడు కలిసి మేకలు, గొర్రెల నుంచి అడ్డగోలుగా రక్తాన్ని సేకరిస్తున్నారు. సరైన పద్ధతి లేకుండా.. ఎటువంటి అనస్థీషియా ఇవ్వకుండా సూదులతో ఆ మూగజీవాల శరీరం నుండి రక్తాన్ని పీల్చేస్తున్నారు. కేవలం రక్తమే కాకుండా.. వాటి రక్తంలోని ప్లేట్‌లెట్లను కూడా వేరు చేసి ప్యాకెట్లలో నింపుతున్నారు. పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ఏకంగా 180 రక్తపు ప్యాకెట్లు లభించాయంటే ఈ అక్రమ వ్యాపారం ఎంత భారీగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.సాధారణంగా మేకలు, గొర్రెల నుండి రక్తం తీయడం అనేది అత్యంత క్రూరమైన చర్య. ఈ ముఠా అడ్డగోలుగా రక్తాన్ని లాగేయడం వల్ల ఆ మూగజీవాలు రక్తహీనతకు గురై.. తీవ్రమైన నీరసంతో ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నాయి. తమ స్వార్థం కోసం ప్రాణాలతో ఉన్న జంతువులను ఇలా హింసించడం చట్టరీత్యా నేరమే కాకుండా.. అది పచ్చి వికృత చేష్ట. ఈ రక్తాన్ని కొన్ని రకాల వ్యాధుల నివారణకు మందులుగా వాడుతున్నామని నమ్మిస్తూ ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.జంతువుల రక్తం తాగితేనో లేదా వాటితో చేసిన మందులు వాడితేనో వ్యాధులు తగ్గుతాయనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలీ వైద్యుల మాయమాటలు నమ్మి ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనలో మటన్ షాపు యజమానిని.. నకిలీ వెటర్నరీ డాక్టరును అరెస్ట్ చేసి జంతు సంక్షేమ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో లోతైన విచారణ జరుగుతోంది.