తెలంగాణలోని డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని... నెలనెలా కట్టాల్సిన వాయిదాలను ఎగ్గొడుతున్న వారిపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నారు. అప్పు తీసుకున్న వారు చెల్లించకపోతే.. ప్రభుత్వం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘రెవెన్యూ రికవరీ’ అనే చట్టాన్ని అమలులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.ఏమిటీ రెవెన్యూ రికవరీ చట్టం..? సాధారణంగా ప్రభుత్వం ఎవరికైనా డబ్బులు ఇచ్చి.. అవి తిరిగి రానప్పుడు ఈ చట్టాన్ని వాడుతుంది. దీని ప్రకారం.. అప్పు తీసుకున్న మహిళలు సకాలంలో డబ్బులు కట్టకపోతే.. అధికారులు నేరుగా వారి ఇంటికి వచ్చి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. భూములు, ఇళ్లు లేదా ఇతర విలువైన వస్తువులను జప్తు చేసి.. వాటిని బహిరంగంగా వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన డబ్బును ప్రభుత్వం తన అప్పు కింద జమ చేసుకుంటుంది.జగిత్యాల జిల్లాలో పరిస్థితి ఇదీ.. అయితే జగిత్యాల జిల్లాలో.. సుమారు 60 వేల మందికి పైగా మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఇప్పటివరకు 475 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చింది. ఇందులో చాలా మంది మహిళలు వ్యాపారాల కోసం 30 వేల నుండి 3 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. అయితే.. వీరిలో కొందరు నెలల తరబడి కిస్తీలు కట్టడం లేదు. జిల్లాలో సుమారు 101 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉండగా.. కేవలం 78 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా భారీ మొత్తంలో మొండి బకాయిలు పేరుకుపోయాయి.గ్రూపు సభ్యులందరికీ ముప్పే..! ఒక విషయం గుర్తుంచుకోవాలి. అప్పు తీసుకున్న సభ్యురాలు ఒకవేళ డబ్బులు కట్టకపోతే.. అధికారులు మొదట ఆమె ఆస్తులను చూస్తారు. ఒకవేళ ఆమె పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోతే.. ఆ అప్పును తీర్చే బాధ్యత సంఘంలోని మిగిలిన సభ్యులందరిపై పడుతుంది. అవసరమైతే గ్రూపులో ఉన్న ఇతర మహిళల ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఈ చట్టంలో ఉంది. కాబట్టి ఒకరు కట్టకపోయినా అందరికీ ఇబ్బందే.సెర్ప్ , మెప్మా అధికారులు ఇప్పటికే గ్రామ గ్రామాన తిరుగుతూ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొందరు మహిళలు అప్పులు కట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపై డీఆర్డీఏ అధికారులు స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని.. బకాయిలు చెల్లించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. కలెక్టర్ల నుంచి కూడా ఇప్పటికే అనుమతులు లభించడంతో.. త్వరలోనే జప్తు ప్రక్రియ మొదలుకానుంది.మహిళలు ఏం చేయాలి..? డ్వాక్రా సంఘాల మహిళలు తమ ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అధికారులతో చర్చించి.. వీలైనంత త్వరగా మంచిది. అధికారులు ఇంటికి వచ్చి ఆస్తులు తీసుకునే వరకు తెచ్చుకోకుండా. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాయిదాలు చెల్లించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇలా చేస్తేనే భవిష్యత్తులో మళ్లీ రుణాలు పొందే అవకాశం ఉంటుంది.