విజయవాడలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం తెరపైకి వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మచిలీపట్నంలో జాతీయ రహదారులపై జరిగిన సమీక్షలో చర్చించారు. విజయవాడ బస్టాండ్‌ నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు, అలాగే బెంజ్‌ సర్కిల్‌ నుంచి గోశాల వరకు రెండు ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించాలని వారు సూచించారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, ఎన్టీఆర్‌ సర్కిల్‌, ఆటోనగర్‌, కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు, గంగూరు, గోశాల వరకు వెహికల్‌ అండర్‌ పాస్‌ (వీయూపీ) నిర్మించాలని కోరారు. ఈ సమీక్షలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న భూసేకరణ సమస్యలు, డీపీఆర్‌ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) లో ఉన్న అభ్యంతరాలు వంటి పలు అంశాలపై చర్చించారు. 216, 65లతో మచిలీపట్నం పోర్టును అనుసంధానించేందుకు రూ.400 కోట్లు మంజూరు కానున్నాయి. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ భారం తగ్గి, విమానాశ్రయానికి ప్రయాణం సులభతరం అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవే 65ను జాతీయ రహదారి 16కి అనుసంధానించడానికి మూడు రూట్లలో కనెక్ట్ చేసే మార్గాలు అవసరం ఉంది. వీటిలో తాడిగడప-ఎనికేపాడు మధ్య 4 కిలోమీటర్లు, పోరంకి-నిడమానూరు మధ్య 6 కిలోమీటర్లు, కంకిపాడు-కేసరపల్లి మధ్య 10 కిలోమీటర్లు ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు నుంచి జాతీయ రహదారి 65, నేషనల్ హైవే 216 వరకు నిర్మించే రోడ్డులో పోర్టు నుంచి మాచవరం రైస్‌మిల్‌ సెంటర్‌ వరకు 3.7 కిలోమీటర్ల దూరం నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మిస్తారు. మాచవరం రైస్‌మిల్‌ నుంచి నేషనల్ హైవే-65 దగ్గర అండర్‌పాస్‌ వరకు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. మంగినపూడి తీరం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న 8 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. అవసరమైన చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీలు) నిర్మాణానికి నిధుల కోసం డీపీఆర్‌లపై ఫోస్ పెట్టారు. గుడివాడలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ప్రస్తుత ఆర్వోబీ నుంచి 3.2 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిని ఎన్‌హెచ్‌-216తో అనుసంధానం చేయాలని ప్లాన్ చేశారు. ఈ రహదారిలో డివైడర్లు, విద్యుదీకరణ, డ్రెయినేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులకు అవసరమైన నిధుల కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 65 డీపీఆర్‌లో కొన్ని మార్పులు ప్రతిపాదించగా.. ఉన్నతస్థాయిలో చర్చించి, మళ్లీ సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. గుడివాడ నుంచి కంకిపాడు వరకు నిర్మించబోయే రహదారి 27 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది మూడు జాతీయ రహదారులను కలుపుతుంది. గన్నవరం మండలం మర్లపాలెం దగ్గర ఆర్వోబీ వద్దకు వెళ్లే దారులను కూడా నిర్మిస్తారు. విజయవాడ-బందరు రోడ్డులో అన్ని చోట్లా లైట్లు పెడతారు. ఒంగోలు-కత్తిపూడి జాతీయ రహదారిని పెడన దగ్గర లోసరి వంతెన నుంచి మచిలీపట్నం దగ్గర తాళ్లపాలెం, గిలకలదిండి మీదుగా కోడూరులోని ఉల్లిపాలెం వంతెన వరకు కలుపుతారు. మార్చిలోగా ఎన్‌హెచ్‌-216పై పెడనలో కడుతున్న ఆర్వోబీ పని పూర్తవుతుంది. గుడివాడ నుంచి పామర్రు మీదుగా కట్టిన ఎన్‌హెచ్‌-165ను చల్లపల్లి వరకు ఎన్‌హెచ్‌216కు కలుపుతారు.