ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 నుంచి ఏపీలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చటంతో పాటుగా.. రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానిపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. అలాగే కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించారు. ఆదోని -1, ఆదోని -2 మండలాలుగా విభజించిన ఏపీ ప్రభుత్వం.. ఆదోని -1 మండలంలో 29 గ్రామాలను, ఆదోని -2 మండలంలో 17 గ్రామాలను చేర్చింది. అయితే ఈ మండలాల ఏర్పాటే ఇప్పుడు స్థానికంగా ఆందోళనలకు కారణమవుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చటంపై.. ఇప్పటికే రాయచోటిలో నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోనూ నిరసనలు మొదలయ్యాయి. ఆదోనిలోని పెద్ద హరివాణం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మండలంగా ప్రకటించేవరకూ ఏ రాజకీయ నేతను కూడా తమ ఊర్లోకి అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఊరి బయటన బోర్డు కూడా ఏర్పాటు చేశారు.మరోవైపు ఆదోని మండలం రాష్ట్రంలోనే అతిపెద్ద మండలంగా గుర్తింపు పొందింది. అయితే పాలనాపరమైన సౌలభ్యంతో పాటుగా ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని ఆదోని మండలాన్ని నాలుగు మండలాలు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి కూడా ఈ విషయంపై అసెంబ్లీలో పలుమార్లు గళమెత్తారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఆదోని మండలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు మండలాలుగా విభజించాలని నిర్ణయించింది. పెద్ద హరివాణం కొత్త మండలంగా కూడా ప్రకటించింది. పెద్ద హరివాణం మండలంలోకి 22 ఊర్లను కూడా కేటాయించింది.అయితే మెజారిటీ గ్రామాల ప్రజల పెద్ద హరివాణం మండల ఏర్పాటును అంగీకరించలేదు. 16 గ్రామాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసన దీక్షలు చేపట్టారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆదోని మండలాన్ని, ఆదోని -1, ఆదోని -2గా విభజించింది. అయితే ఈ నిర్ణయంపై పెద్దహరివాణం గ్రామస్థులు మండిపడుతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా తమ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పెద్ద హరివాణం గ్రామస్థులు.. తాజాగా తమ ఊరిని మండల కేంద్రం చేసేవరకూ ఏ రాజకీయ నాయకుడిని కూడా ఊర్లోకి రానివ్వకూడదని నిర్ణయించారు. ఆ మేరకు ఊరి బయట బోర్డును పాతారు.