మత్స్య పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదికవుతోంది. సాధారణంగా హిమాలయాలు, శీతల పర్వత ప్రాంతాలకే పరిమితమైన ఉష్ణమండల వాతావరణంలో పెంచబోతున్నారు. దేశంలోనే మొట్టమొదటి భారీ స్థాయి రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ (RAS) ఆధారిత రెయిన్‌బో ట్రౌట్ ఫారమ్‌ను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ రేపు (జనవరి 5) ప్రారంభించనున్నారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు చేపల సాగు అనేది ఆయా ప్రాంతాల వాతావరణంపై ఆధారపడి ఉండేది. కానీ ఈ ప్రాజెక్ట్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. అత్యాధునిక ప్రెసిషన్ ఇంజనీరింగ్ , నీటిని నిరంతరం శుద్ధి చేసే వాటర్ రీసర్క్యులేషన్ సాంకేతికతతో హైదరాబాద్ వంటి వేడి వాతావరణంలో కూడా ఏడాది పొడవునా శీతల నీటి చేపలను పెంచవచ్చని ఈ సంస్థ నిరూపించింది. వాతావరణం కంటే సాంకేతికతే సాగుకు ప్రాధాన్యతనిస్తుందని ఈ కేంద్రం చాటిచెప్పనుంది.కేవలం ఉత్పత్తి కేంద్రంగానే కాకుండా పరిశోధనా సంస్థగా కూడా పనిచేయనుంది. గ్రామీణ యువతకు, విద్యార్థులకు ఆటోమేషన్, బయోసెక్యూరిటీ, ఆధునిక ఆక్వాకల్చర్ పద్ధతులపై ఇక్కడ ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, నూతన పారిశ్రామికవేత్తలు తయారయ్యే అవకాశం ఉంది. మత్స్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుండి ఇప్పటివరకు సుమారు రూ. 38,572 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా కోల్డ్ వాటర్ ఫిషరీస్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలకే పరిమితమైన ఈ సాగును ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఏటా 14 లక్షల ట్రౌట్ విత్తనాల ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.మత్స్య రంగాన్ని కేవలం జీవనోపాధిగానే కాకుండా, ఒక సాంకేతిక ఆధారిత ఎగుమతి రంగంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే ఐటీబీపీతో ఒప్పందం చేసుకుని సరిహద్దు గ్రామాల్లో ఈ చేపల సరఫరాను ప్రోత్సహిస్తోంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో ఫిషరీస్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ సరికొత్త సాగు కేంద్రం, భవిష్యత్తులో దేశీయంగా చేపల వినియోగాన్ని పెంచడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో కీలక పాత్ర పోషించనుంది.