పిల్లల మెదళ్లను తినేస్తున్న చాట్ జీపీటీ.. AI భయానక నిజం బయటపడిందా? తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక!

Wait 5 sec.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పిల్లల మెదళ్లను తినేస్తోందా? ఏఐ ఒక తరం భవిష్యత్తును బలి కోరుతోందా? మన పిల్లలు ఎందుకూ పనికి రాకుండా అయిపోతారా? ఏఐ వెనుక ఉన్న భయానక నిజం ఇప్పుడు బయటపడితోందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. పలు అధ్యయనాలు, అంకెలు, అనుభవాలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయి. ఇన్ని రోజులూ ఊహాగానంగా ఉన్నా.. ఈ వాదనకు ఇప్పుడు బలం చేకూరుతోంది. ఏఐ వల్ల లాభాల సంగతి అటుంచితే.. దీనివల్ల మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే అభిప్రాయాలూ లేకపోలేదు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మావవ మేధస్సును మించిపోయి.. మనల్నే బానిసలుగా మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు!.ఫ్యూచర్‌లో ఇలాంటి ముప్పు జరిగేందుకు ఇప్పుడే బీజం పడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు.. ముఖ్యంగా చాట్ జీపీటీ వంటివి (ChatGPT) మన పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని నాశనం చేస్తున్నాయి, విమర్శనాత్మక ఆలోచనాశక్తిని చంపేస్తున్నాయని పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఉన్న పరిశోధనల గణాంకాలు, ఏఐ వల్ల కలిగిన అనుభవం.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మనషుల్లో అతి ముఖ్యమైన మేధస్సును ఏఐ నిర్వీర్యం చేస్తోందనేది.. ఇప్పుడు కేవలం ఒక ఊహాగానం మాత్రమే కాదు.ఆశ్చర్యకరంగా.. విద్యా సంస్థలు ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, పాఠశాలలు.. చాట్ జీపీటీ ఎడ్యు (ChatGPT EDU) వంటి టూల్స్‌ని తరగతి గదుల్లోకి తీసుకువస్తు్న్నాయి. విద్యార్థులు వీటిని ఉపయోగించేలా ఎంకరేజ్ చేస్తున్నాయి. క్విజ్‌లు, పరీక్షలు లేదా వ్యాసాల కోసం చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నామని ఓ సర్వేలో.. దాదాపు 50 శాతం మంది విద్యార్థులు అంగీకరించారు. ఏఐ వాడకం వల్ల.. ఆలోచనా శక్తి.. ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్ ప్రతికూలంగా ప్రభావితం అవుతోంది. గత మూడు నాలుగేళ్లుగా విద్యార్థుల పఠన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆలోచనా శక్తికి అగ్నిపరీక్ష..!ఐరోపా, యూకే, ఆసియావ్యాప్తంగా జరిగిన పలు లార్జ్ స్కేల్ పరిసోధనలు కీలక విషయాలు వెల్లడించాయి. ముఖ్యంగా విద్యార్థులు (17–25 సంవత్సరాల వయస్సు) ఏఐపై ఎక్కువగా ఆధారపడుతున్నారట. ఏఐని విపరీతంగా ఉపయోగిస్తుండటం వల్ల.. విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ (Critical Thinking) శక్తి క్రమంగా తగ్గిపోతోంది. విశ్లేషణ చేసే సామర్థ్యం, సమస్యలకు పరిష్కారాలను కనుగొనే సామర్థ్యాలు బలహీనపడుతున్నాయి. ఫలితంగా పరీక్షలలో తక్కువ స్కోరు సాధిస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. సొసైటీస్‌ జర్నల్‌లో ప్రచురితమైన "ఏఐ టూల్స్ ఇన్ సొసైటీ : ఇంపాక్ట్స్ ఆన్ కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ క్రిటకల్ థింకింగ్" అనే పరిశోధనా పత్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏఐపై ఆధారపడిన యువకులు.. క్రిటికల్ థింకింగ్‌లో వారి కంటే వయసులో పెద్దవారి కంటే తక్కువ స్కోర్ చేశారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఏఐ..ఐదేళ్ల కిందట వచ్చిన కోవిడ్ సంక్షోభం.. ప్రపంచంలో ఎలాంటి మార్పులకు కారణమైందో అందరికీ గుర్తే. ముఖ్యంగా అది విద్యార్థులపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. కోవిడ్ వల్ల చాలా మంది పిల్లలు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం చదువుకు దూరమయ్యారు. ఆ సమయంలో అంతంతమాత్రంగానే పాఠశాలలు నడిచాయి. ఇక కోవిడ్ భయాల వల్ల ఆ కొద్ది సమయంలో టీచర్లు ఏం చెప్పారో, పిల్లలు ఏం నేర్చుకున్నారో వారికే తెలియాలి. ఈ పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఇప్పుడు.. మెదడుకు పని చెప్పకుండా ఏఐ నుంచే నేరుగా సమాధానాలు పొందుతున్నారు. ఏఐ టూల్స్ ఇప్పుడు "కోవిడ్ 2.0"ను సృష్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మున్ముందు ఇది ఇలాగే కొనసాగితే.. విద్యార్థులు ఒక సంవత్సరం తప్పడం కాదు.. విద్యార్థి దశలో కీలకమైన భాగాన్ని కోల్పోతారు. ఊహించిన దానికంటే దారుణంగా పరిస్థితి!ఒక నిర్దిష్ట వయస్సు రాకముందే పిల్లలను కారు నడపడానికి ఎందుకు అనుమతించరో ఎప్పుడైనా ఆలోచించారా..? శక్తిమంతమైన మెషీన్‌ను నడపడాలంటే.. దానికి అవసమైన పరిజ్ఞానం ఉండాలి. శారీరకంగా, మానసికంగా ప్రతికూలతలను అధిగమించే సామర్థ్యం ఉండాలి. అందుకే భారత్‌లో 18 ఏళ్లు నిండితేనే కారు లాంటి వాహనాలు నడపడానికి లైసెన్స్ ఇస్తారు. ఈ లెక్కన ఏఐ కూడా ఒక శక్తిమంతమైన యంత్రమే!. కానీ మనం దాన్ని పిల్లల చేతుల్లో ఇట్టే పెట్టేస్తున్నాం. అంటే.. ఎలాంటి శిక్షణ, రక్షణ లేకుండా బుగాటీ చిరాన్ (Bugatti Chiron) కారు తాళాలను పిల్లలకు అప్పగిస్తున్నట్టే. అందుకే పిల్లల చేతిలో విచ్చల విడిగా ఏఐ ఉంటే.. అది వారికే కాదు సమాజానికి కూడా అనర్థం.చాలా విషయాలను ఏఐ సులభతరం చేయగలదు. ఆరేళ్ల పిల్లాడు ఏఐని ఉపయోగించి ఓ పనిచేసే యాప్‌ను తయారు చేశాడంటే.. అద్భుతమే. అయితే, కేవలం ఒక ప్రాంప్ట్‌ను ఇచ్చి.. అవుట్‌పుట్ కోసం వేచి ఉండటమే జీవితం అని పిల్లలకు మనం నేర్పలేము కదా. ప్రతి పనిలో క్రిటికల్ థింకింగ్ అవసరం ఉంటుంది. ఇలాంటి టూల్స్ అందుబాటులో ఉండవు. అప్పుడు పిల్లలు ఏం చేయాలి అనే విషయం ఆలోచించారా?జీవితంతో చెలగాటం..ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ఒక విద్యార్థి.. తాను రెండేళ్లుగా ఏ అసైన్‌మెంట్‌ను టైప్ చేయలేదని చెప్పాడు. ప్రతిసారీ చాట్ జీపీటీ నుంచి కాపీ పేస్ట్ చేశాడట. అతడు ఓ టాప్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నా.. జాబ్ మార్కెట్‌కు సరిపోయే నైపుణ్యాలు అతడిలో లేవు. అంటే, ఉద్యోగానికి సరిపోడు. ఉద్యోగంలో కాపీ పేస్ట్ చేస్తే.. పని జరగదు కదా మరి..! అలాగని నిషేధించలేం..!అలాగని విద్యకు సంబంధించిన అంశాల్లో ఏఐని పూర్తిగా నిషేధించాలడం కూడా సరైందికాదు. ఏఐ విద్యపై సానుకూల ప్రభావాన్ని చూపగలదు. ఇది టీచర్లకు ఒక గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది. పిల్లలకు అపరిమిత నాలెడ్జ్‌ను అందించగలదు. భవిష్యత్తులో విద్యా రంగంలో ఏఐ కీలకంగా నిలుస్తుందని 96 శాతం మంది టీచర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పద్ధతిలో మాత్రం అది జరగదు. విద్యార్థులకు కేవలం సమాధానాలు ఇచ్చే చాట్ జీపీటీ వంటి సాధారణ ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో ఆ పని కాదు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు..పరిస్థితి ఇంకా చేజారిపోలేదు. టీచర్లు, విద్యా సంస్థలు, ఎడ్ టెక్ కంపెనీలు పరస్పర అవగాహనతో పనిచేయాలి. అందుకోసం ఈ పనులు చేయాలి: విద్యా సంస్థలు.. నైతిక, బాధ్యాతాయుతమైన ఏఐ యూసేజ్‌పై దృష్టి పెట్టని ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించొద్దు. అంటే.. నేరుగా విద్యార్థులకు ఆన్సర్లు ఇచ్చే చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్‌కు విద్యా వ్యవస్థలో స్థానం ఉండకూడదు.విద్యార్థులకు డైరెక్ట్‌గా సమాధానాలు ఇవ్వని.. ప్రత్యేకంగా నిర్మించిన ఏఐ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను పాఠశాలలు వాడాలి. అవి పిల్లల్లో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు పెంపొందించేలా ఉండాలి. దీని కోసం టెక్ కంపెనీలు ప్రతినిధులు, విద్యావేత్తలు కలిసి మార్గదర్శకాలను రూపొందించాలి. ఏఐ ఎడ్‌టెక్ కంపెనీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రతి స్థాయిలో విద్యావేత్తలతో కలిసి పని చేసి.. విద్యార్థుల ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ కోసం ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను క్రియేట్ చేయాలి.ఏఐను విద్యార్థులు లెర్నింగ్ కోసం ఉపయోగించేలా జాగ్రత్త తీసుకోవాలి.. షార్ట్ కట్‌, చీటింగ్‌లకు కాదు. పిల్లలకు పూర్తిగా ఏఐతోనే విద్య అందిస్తామంటే కుదరని పని. ఎందుకంటే. ఏఐ ఎప్పటికీ ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేదు. ఏఐ అనేది టీచర్లకు సహాయపడే ఒక టూల్ మాత్రమే. వారికి సమయాన్ని ఆదా చేసి విద్యార్థులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.అన్నిటికంటే ముందు.. పిల్లల తల్లిదండ్రుల నుంచే మార్పు మొదలవ్వాలి. పిల్లలను పాఠశాలలో చేర్పించి చేతులు దులిపేసుకుంటే కుదరదు. స్కూళ్లలో విద్యాబోధన ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఏఐని పిల్లలు వీలైనంత తక్కువ వాడుతూ వారి పని చేసుకునేలా చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలపై అశ్రద్ధ వహిస్తే.. ఓ తరం పిల్లల మొదళ్లను ఏఐ తొలిచేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే కృత్రిమ మేధ.. మానవ మేధస్సును అధిగమించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే, అప్పుడు పర్యవసానాలు ఎంత భయానకంగా ఉంటాయో ఊహించుకోవచ్చు!