తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్. నేడు రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. గత వారం శనివారం నుంచి సోమవారం వరకు రాగా.. మంగళవారం ఒక్కరోజు విద్యాసంస్థలు నడిచాయి. తాజాగా నేడు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏఐఎస్ఎఫ్ (AISF), ఎస్‌ఎఫ్‌ఐ (SFI), పీడీఎస్‌యూ (PDSU), ఏఐవైఎఫ్ (AIYF) వంటి ప్రముఖ విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనిని నియంత్రించడానికి తక్షణమే ఒక చట్టం తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, MEO (మండల విద్యాధికారి), DEO (జిల్లా విద్యాధికారి) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. దూర గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం ఒక పెద్ద సమస్యగా మారిందని, వారికి ఉచిత బస్ పాస్‌లను అందించాలని డిమాండ్ చేస్తున్నారు.జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతున్నారు. అనేక మంది విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారని, వారి పోషకాహార అవసరాలను తీర్చడానికి జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు తమ సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయడంలో తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు కూడా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ముందస్తుగానే మంగళవారం సాయంత్రమే బంద్ కారణంగా జులై 23 స్కూళ్లకు సెలవు ఉంటుందని.. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని సెల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపారు.