ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో తల్లిదండ్రులను ఓ కొడుకు గొడ్డలితో నరికి చంపాడు. మారేడుమిల్లి మండలం తుర్రవాడ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మల్లిరెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో.. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిదండ్రులను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన మల్లిరెడ్డి.. తల్లిదండ్రులు సన్యాసిరెడ్డి, బోడెమ్మతో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఆవేశంలో గొడ్డలితో తల్లిదండ్రులపై మల్లిరెడ్డి దాడి చేశాడు. ఈ ఘటనలో సన్యాసిరెడ్డి, బోడెమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మల్లిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మల్లిరెడ్డికి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.