ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రాజాం మున్సిపాలిటీకి త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిన ప్రకటన.. దీనికి సంకేతం ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించారు. దీంతో రాజాం మున్సిపాలిటీకి కూడా త్వరలోనే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి. రాజాం నగర పంచాయతీగా అప్ గ్రేడ్ అయిన తర్వాత రెండు దశాబ్దాల నుంచి ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. అయితే త్వరలోనే ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.కోర్టు సమస్యలు, సమీప గ్రామాల విలీనం కారణంగా ఎన్నికలు జరగకుండా వాయిదా పడిన 21 మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించారు. ఆయా చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటంతో 15వ ఆర్థిక సంఘం నిధులు అందటం లేదు. దీంతో ఆయాచోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే మూడు నెలల్లోగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాజాం మున్సిపాలిటీ విషయానికి వస్తే 20 ఏళ్ల కిందట దీనిని నగర పంచాయతీగా అప్ గ్రేడ్ చేశారు. పొనుగంటివలస, కొత్తవలస, కొండంపేట, సారధి మేజర్ పంచాయతీలను ఇందులో విలీనం చేసి రాజాం నగర పంచాయతీగా మార్చారు. అయితే ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ పొనుగంటివలస, కొత్తవలస, కొండంపేట పంచాయతీలు 2005లో కోర్టును ఆశ్రయించాయి. తమ పదవీకాలం ఇంకా ముగిలి ఉండగానే, తమ అనుమతి లేకుండా ఏకపక్షంగా విలీనం చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. నాలుగేళ్ల కిందట తీర్పు ఇచ్చింది. ఈ మూడు పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని.. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగడం లేదు. అయితే స్పెషల్ ఆఫీసర్లు తీర్మానాలను ఆమోదించడంతో నుంచి రాజాం మున్సిపాలిటీగా 2021లో మారింది. 24 వార్డులతో రాజాం మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే ఎన్నికలు మాత్రం జరగకపోగా.. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా త్వరలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.