హైదరాబాద్ రేవంత్ సర్కార్ కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించటమే లక్ష్యంగా అయింది. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు పొందేలా అన్ని పార్టీలకు చెందిన ఎంపీల ద్వారా ఒత్తిడి తేవాలని భావిస్తోంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (HAML) మెట్రోరైలు రెండో దశ మొదటి భాగంలో ప్రతిపాదించిన మార్గాలకు సంబంధించిన పూర్తి వివరాలను లోక్‌సభ సభ్యులకు అందజేసింది. హైదరాబాద్‌లో మెట్రోరైలు రెండో దశ 2(ఎ)లో భాగంగా 54 స్టేషన్లతో మార్గాలను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు గత ఏడాది నవంబర్‌లో కేంద్రానికి సమర్పించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రస్తుతం డీపీఆర్‌లు పరిశీలిస్తున్నట్లు చెబుతోంది. ఇటీవల పుణే మెట్రోకు కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోకు కూడా త్వరితగతిన అనుమతులు వచ్చేలా పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలను కోరింది. అనుమతుల కోసం ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి HAML అధికారులకు ఇప్పటికే పలుమార్లు సూచించారు.మెట్రోరైలు 2(ఎ) విస్తరణ ప్రతిపాదనలు ఐదు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఆయా నియోజకవర్గాల్లో మెట్రో మార్గం పొడవు, స్టేషన్ల వివరాలు చూసినట్లయితే అత్యధికంగా చేవెళ్ల లోక్‌సభ స్థానంలో 39.09 కిలోమీటర్లు 30 స్టేషన్లు నిర్మించనున్నారు. ఆ తర్వాత మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో 12.28 కిలోమీటర్లు, 11 స్టేషన్లు నిర్మిస్తారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 13.32 కిలోమీటర్లు, 11 స్టేషన్లు రానున్నాయి. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో 8.16 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ ప్రతిపాదనలు ఉండగా.. 5 స్టేషన్లు ఉండనున్నాయి. అతి తక్కువగా భువనగిరి పరిధిలో 3.6 కిలోమీటర్లు, 3 స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విస్తరణకు కేంద్రం నుంచి అనుమతులు ఎప్పుడు వస్తాయో వేచి చూడాలి మరి.