"మహిళల మృతదేహాలు చాలా వరకు లో దుస్తులు కూడా లేకుండా ఉన్నాయి. అందులో చాలా మంది అమ్మాయిలు, మహిళలే ఉన్నారు. కొన్ని మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలున్నాయి. వారిపై హత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. " ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన మాటలివి. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో.. గతంలో పని చేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు (విజిల్‌బ్లోయర్) జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో తాను 1998 నుంచి 2014 వరకు వందకుపైగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సమర్పించాడు. అయితే ఈ విజిల్‌బ్లోయర్ వాంగ్మూలంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సిట్ విచారణ..ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఈ కేసును () విచారించడానికి శనివారం కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.డీజీపీ ప్రనభ్ మొహంతీ నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచెత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్ దయమ విచారణ చేపట్టారు. అయితే చనిపోయినవారంతా ఎవరు? ఏమాత్రం అనుమానం రాకుండా 100 మందికి పైగా మృతదేహాలను ఎలా ఖననం చేశారు? ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాడు? ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారనే వాదనేంటి? ప్రభుత్వం ఎవరిని రక్షిస్తోంది? అనే ప్రశ్నలు ఈ కేసులో వ్యక్తమవుతున్నాయి.పాఠశాల దుస్తుల్లో బాలికలుఈ తాను చాలా మంది ఆడపిల్లల మృతదేహాలు నేత్రావతి నది సమీప ప్రాంతాల్లో ఖననం చేశాని.. అందులో మైనర్లు కూడా ఉన్నట్లు చెప్పాడు. కొంతమంది బాలికలు పాఠశాల దుస్తుల్లో కనిపించినట్లు.. ఇంకొంత మంది మృతదేహాలు.. లో దుస్తులు కూడా లేకుండా, శరీరాలపై లైంగిక దాడుల, కొట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయని చెప్పాడు. మహిళలపై ఎంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. చనిపోయింది ఎవరు?మృతదేహాలను ఖననం చేసిన ప్రదేశాల నుంచి విజిల్ బ్లోయర్.. పుర్రె వంటి శరీర అవశేషాలను బయటకు తీశాడు. ఇంకొన్ని ప్రదేశాలకు కూడా విచారణ అధికారులను తీసుకెళ్తానని చెప్పాడు. అయితే ఇప్పటివరకు చనిపోయింది ఎవరో, మృతదేహాల అవశేషాలు ఎవరివో తెలిసిరాలేదు. వీటిపై సిట్ అధికారులు డీఎన్ఏ అనాలసిస్, స్కెలిటల్ ఫోరెన్సిక్ ( DNA analysis and skeletal forensics) పరీక్షలు చేసి.. మృతదేహాలు ఎవరివి, వాళ్లు ఎలా చనిపోయి ఉంటారని అంచనాకు రావాలి. అప్పుడే చనిపోయింది ఎవరో కచ్చితంగా చెప్పేందుకు అవకాశం లభిస్తుంది. ఇంకా పూర్తిగా మృతదేహాలను వెలికి తీయకపోవడం.. అప్పుడే విజిల్‌బ్లోయర్ ఇచ్చిన స్టేట్‌మెంట్లు బయటకు లీక్ కావడంతో.. విచారణలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.చనిపోయింది ఎవరో కచ్చితంగా తెలియకున్నా.. అందులో తమవారు ఉంటారని మిస్సైన కొందరి వ్యక్తుల కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. 2003లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తిరిగిరాలేదు. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు.. అనన్య కేసును కూడా విచారించాలని కోరుతున్నారు. ఇలాగే ఇంకొన్ని బాధిత కుటుంబాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ కేసులో ఎక్కువ మంది మహిళలు ఉండటంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరిగాయి. మొదట్లో సిట్ విచారణపై కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. కానీ తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో సిట్ ఏర్పాటు చేసింది. విజిల్‌బ్లోయర్ టైమింగ్‌పై అనుమానాలు..!ఈ ఘటనలు జరిగి ఇన్నేళ్లు అయితే.. విజిల్‌బ్లోయర్ ఇప్పుడే ఎందుకు తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలు అందరి మదిలో వ్యక్తమవుతున్నాయి. అయితే తాను వందకు పైగా మృతదేహాలను దహనం చేయడం, పాతిపెట్టాల్సి వచ్చిందని.. అలా చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని విజిల్‌బ్లోయర్ తెలిపాడు. చనిపోయిన వారికి గౌరవం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి.. తన ప్రాణాలను పణంగా పెట్టి ఇప్పుడు చెబుతున్నానని అన్నాడు. తన కుటుంబంలోని ఓ బాలికను ఉన్నతాధికారులు వేధించారని.. అందుకే 2014లో దర్మస్థల నుంచి వెళ్లిపోయానని తెలిపాడు. తప్పు చేశాననే భావన తనను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదని పేర్కొన్నాడు. శానిటేషన్ వర్కర్‌కు ఇలా చేయమని చెప్పిందెవరు?జులై 11న విజిల్‌బ్లోయర్ బెల్తంగడి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో ఓ ప్రాంతంలో తాను ఖననం చేసిన మృతదేహం అవశేషాలు సహా.. దానికి సంబంధించిన ఫొటోలను కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ సమయంలో కొందరి పేర్లు కూడా బయటపెట్టినట్లు సమాచారం. ఆ హత్యలు చేసింది వారేనని ఆరోపించినట్లు తెలుస్తోంది. దీంతో వారెవరై ఉంటారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఏమాత్రం అనుమానం రాకుండా మృతదేహాలను ఎలా పాతిపెట్టాడు?"మేము నిన్ను ముక్కలుగా నరికేస్తాం. నీ శరీరాన్ని మిగిలిన వారిలాగే కప్పిపెడతాం" అంటూ తనను బెదిరించారని శానిటేషన్ వర్కర్ చెప్పాడు. ఈ భయంతో తాను ఎవరికీ చెప్పలేదన్నాడు. మరో విషయం ఏంటంటే.. మృతదేహాలను పాతిపెట్టడానికి నేత్రావతి నది సమీపంలోని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడీ విజిల్‌బ్లోయర్. అక్కడైతేనే డెడ్ బాడీలు త్వరగా, గుర్తుపట్టలేకుండా కుళ్లిపోతాయని. అంతేకాకుండా నిందితులు చంపేసి.. మృతదేహాలను గుర్తుపట్టరాకుండా చేశారట. అందుకే మృతదేహాల ముఖాలపై యాసిడ్ పోసిన, బట్టలు చింపేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక ఆ శానిటేష్ వర్కర్ దళిత వర్గానికి చెందినవాడు కాబట్టి.. లో ఫ్రొఫైల్ ఉండటం వల్ల అతడు ఏం చేస్తున్నాడో ఎవరూ గమనించలేకపోయారని తెలుస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని కాపాడుతోంది?ఈ కేసులో దర్మస్థల క్షేత్రానికి సంబంధించిన కొందరు శక్తిమంతమైన వ్యక్తులు.. ఈ హత్యలకు కారణమని, విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరిని ప్రభుత్వం కాపాడుతోందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం.. ఈ ఆరోపణలపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండు స్పందించారు. ఈ కేసులో తాము ఎవరినీ రక్షించడం లేదని చెప్పారు. దీన్ని సంచలనాత్మకం చేయాలని తాము అనుకోవడం లేదని.. కానీ ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేశాయని.. ఇవి నిజమని తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మస్థల శక్తిని తక్కువ చేయడానికి ఇదంతా చేస్తున్నారా?ధర్మస్థల స్ట్రెంత్‌ను తక్కువచేయడానికే ఇలా టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి అన్నారు. ఈ ప్రాంతం ఓ మతానికి సంబంధించి పవిత్రమైన ప్రదేశమని, ప్రజలు విశ్వసించే స్థలమని అన్నారు. ఆలయాలు దశాబ్దాల నుంచి ఎవరిపై వివక్ష చూపడం లేదని.. దీన్ని అవమానించే చర్యలు ఏళ్ల నుంచి జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రాంతం.. ప్రజల్లో సోదరభావాన్ని, భక్తి, సమానత్వాన్ని పెంపొందిస్తున్నందుకే.. ఇలా కుట్రలో భాగంగా టార్గెట్ చేశారని ఆరోపణలు గుప్పించారు. విజిల్‌బ్లోయర్‌గా మారిన శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలన్నీ నిజమైతే.. దేశ చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. మహిళలపై ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో సిట్ విచారణ జరుగుతున్నా కొద్దీ.. మరిన్ని విషయాలు బయటపడతాయి. సాక్షులు ప్రభావితం అయితే కేసు నీరుగారిపోతుంది. కాబట్టి ఆ వర్కర్‌కు పటిష్ఠమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిదే. విచారణ అధికారులపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నిస్పక్షపాతంగా విచారణ జరగాలి. లేకపోతే.. ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు.