ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది.. వారికి ఒక మంచి అవకాశం కల్పించింది. పంట వేయకపోయినా, రైతులు ముందుగానే పంట బీమా చేసుకోవచ్చు. ఆ తర్వాత పంట వేసి, ఆ వివరాలను ఈ-పంటలో నమోదు చేయాలి. దీనివల్ల చాలా మంది రైతులకు మేలు జరుగుతుంది. వర్షాలు లేక పంటలు వేయలేని రైతులు కూడా బీమాకు దూరం కాకుండా ఉంటారు. గతంలో పంట వేసిన తర్వాత మాత్రమే బీమా చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఆ నిబంధనను మార్చింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద, ప్రతి జిల్లాలో ఒక పంటకు బీమా చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా జిల్లాలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారు అనుకుంటే.. అక్కడ దీనికి తక్కువ ప్రీమియం చెల్లిస్తే ఎక్కువ పరిహారం పొందవచ్చు.ఈ మేరకు హెక్టారుకు రూ.210 ప్రీమియం చెల్లిస్తే.. ఒకవేళ పంట నష్టపోతే రూ.1.05 లక్షల వరకు పరిహారం వస్తుంది. అదే రైతు ఎకరాకు రూ.84 చెల్లిస్తే.. పంట నష్టపోతే రూ.42 వేల వరకు బీమా పరిహారం పొందొచ్చు. ఉదాహరణకు.. వరి పంటకు బీమా చేయడానికి ఆగష్టు 15ను చివరి తేదీగా నిర్ణయించారు. అప్పటికి నాట్లు వేయకపోయినా బీమా చేసుకునే అవకాశం ఉంటుంది. రైతులు వర్షాలు బాగా పడిన తర్వాత నాట్లు వేసుకోవచ్చు. కానీ పంట వేసిన తర్వాత ఈ-పంటలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. పంట వేయకపోతే బీమాకు చెల్లించిన డబ్బులు వృథా అవుతాయంటున్నారు వ్యవసాయ అధికారులు. ఖరీఫ్ సీజన్లో హెక్టారుకు రూ.210 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అదే రబీలో అయితే రూ.1,575 చెల్లించాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అంటున్నారు. రైతులు పంట వేయకపోయినా బీమా ఎలా చేయాలనే సందేహం అవసరం లేదని.. చివరి తేదీలోగా బీమా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు రైతులు నాట్లు వేసిన తర్వాత ఈ-పంటలో నమోదు చేయించుకుంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు గ్రామ సచివాలయాల్లో సంప్రదించి ప్రీమియం చెల్లించవచ్చు అంటున్నారు. అలాగే NCIP యాప్ ద్వారా కూడా ప్రీమియం డబ్బుల్ని చెల్లించొచ్చు. మరోవైపు పంట రుణం తీసుకున్న రైతులు బ్యాంకులో ఒక దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది. బ్యాంక్ రుణం నుంచి బీమా ప్రీమియంను తగ్గిస్తారు.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. పంట వేయకపోయినా సరే బీమా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం చాలా మంచి నిర్ణయం అంటున్నారు రైతులు.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.