Nita Ambani: హస్త కళలను ఆదరిస్తూ హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు రిలయన్స్ సంస్థ మరో స్వదేశ్ స్టోర్‌ను తెరుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తొలి స్టోర్ ప్రారంభించిన రిలయన్స్ ఇప్పుడు రెండో స్టోర్‌ను ముంబైలో ఈ నెల 25వ తేదీన తెరవనుంది. ముంబై నగరంలోని ఈరోస్ ప్రాంతంలో ఈ కొత్త స్టోర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త స్టోర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ భారతీయ కళలను, సంప్రదాయాలను గౌరవించే విషయంలో ఎప్పుడూ ముందుడే నీతా అంబానీ ఈ పూజా కార్యక్రమంలో రాజసం ఉట్టిపడేలా కనిపించారు. గులాబీ రంగులోని మదురై కాటన్ ఘర్చోలా చీర ధరించి అందరినీ ఆకర్షించారు. ఈ చీరను రాజ్‌కోట్‌కు చెందిన రాజ్ శ్రుందర్ అనే చేనేత కళాకారుడు సుమారు 10 నెలల పాటు శ్రమించి తయారు చేసినట్లు స్వదేశ్ స్టోర్ పేర్కొంది. ఈ చీరపై తన వివాహ సమయంలో ధరించిన వారసత్వ ఆభరణాలను నీతా అంబానీ మళ్లీ ధరించారని తెలిపింది. వీటితో పాటు , నీతా అంబానీల పెళ్లి నాటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఆభరణాలు, పెళ్లి ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది కేవలం ఒక నగ మాత్రమే కాదని, వారసత్వం, ప్రేమ, ఒక తరం మహిళల నుంచి మరో తరం మహిళలకు ప్రవహించే శాశ్వతమైన శక్తికి చిహ్నమని రాసుకొచ్చింది స్వదేశ్ స్టోర్. ఈ ఆభరణం నీతా అంబానీ నుంచి ఆమె కుమార్తె ఇషా అంబానీ కుమార్తె, మనవరాలు ఆదియా శక్తికి వారసత్వంగా వెళ్లనుందని పేర్కొంది. ఆభరణాలు, కట్టూబొట్టుతో సాంస్కృతిక వారసత్వానికి నీతా అంబానీ ప్రతీకగా నిలిచారని చెప్పవచ్చు. నీతా అంబానీ ఫోటోలతో పాటుగా ముకేశ అంబానీ, నీతా అంబానీల పెళ్లి ఫోటోలు సైతం స్వదేశ్ ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.