అద్భుతమైన అవకాశం. జూలై 29న (మంగళవారం) తిరుమలలో గరుడ పంచమి నిర్వహించనున్నారు. గరుడ పంచమి సందర్భంగా జూలై 29వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకూ శ్రీవారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. అయితే తిరుమలలో ఒకే నెలలో రెండుసార్లు గరుడ వాహనసేవ రావటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన ఘటనే జూలై నెలలో జరిగింది. జూలై 10వ తేదీ గురుపౌర్ణమి సందర్భంగా స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగితూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇప్పుడు గరుడ పంచమి సందర్భంగా జూలై 29న మరోసారి గరుడ వాహన సేవను టీటీడీ నిర్వహించనుంది.*మరోవైపు ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. గరుడ పంచమి సందర్భంగా కొత్త దంపతులు తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని, మహిళలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలంగా, మంచి వ్యక్తిత్వంతో ఉండాలిన గరుడ పంచమి పూజ చేస్తారు. అలాగే నిర్వహిస్తారు.తిరుమలలో భక్తుల రద్దీ మరోవైపు తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. శనివారం రోజున 90011 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33 వేల 328 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హూండీ ద్వారా రికార్డు స్థాయిలో శనివారం ఒక్కరోజే రూ.4.23 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో నారాయణగిరి షెడ్ల వరకూ భక్తులు బారులు తీరారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పట్టినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. *మరోవైపు తిరుమల కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాలలో ఏదైనా తెలియకుండా దోషం జరిగితే.. ఆ దోషాల వలన ఆలయ పవిత్రతకు లోపం రాకుండా ఆగమశాస్త్రాల ప్రకారం ఈ పవిత్రోత్సవాలు ఏటా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు తీసుకువచ్చారు. అక్కడే స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు, అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. మూడురోజుల పాటు తిరపతి కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.