ఏపీ పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్‌‌కు సంబంధించి ప్రయాణికులకు, సరకు రవాణా కోసం మూడో రైలు మార్గం పూర్తవుతోంది. ఈ ప్రాజెక్టు 2015-16లో రూ.3246 కోట్లతో 288 కిలోమీటర్ల మేర ప్రారంభమైంది.. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ మార్గం పనులు ముగింపు దశకు వచ్చాయి. ఈ రైళ్లు వేగంగా, సకాలంలో గమ్యస్థానాలకు చేరుతాయి అంటున్నారు అధికారులు. అయితే ఈ మూడో రైలు మార్గం సంగతి అలా ఉంటే.. మనుబోలు-గూడూరు మధ్య ఉన్న రైల్వే వంతెన ఇప్పుడు అరుదైన ఘనతను అందుకుంటోంది. ఈ బ్రిడ్జి దక్షిణాసియా ఖండంలోనే చాలా అరుదైనదని చెబుతున్నారు అధికారులు. ఈ బ్రిడ్జిపై పై నుంచి, కింద నుంచి రైళ్లు పరుగులు తీస్తుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది అంటున్నారు. నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొస్తోంది. ఎగువ, దిగువ మార్గాల్లో ఆర్‌ఓఆర్‌ బ్రిడ్జి నిర్మించడం వల్ల భారీ వర్షాలు, వరదలు వచ్చినా రైళ్లు ఆగకుండా వెళ్లొచ్చు అంటున్నారు.ప్రస్తుతం మూడో లైన్ పనులు బాపట్ల-విజయవాడ మధ్య వేగంగా జరుగుతున్నాయి. అలాగే తెనాలి రైల్వేస్టేషన్ జంక్షన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు పూర్తికాగానే ఈ ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు ఈ మార్గంలో వెళ్లే రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయంటున్నారు.. అయితే 130 కిలోమీటర్ల వేగం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండందని అంచనాలు ఉన్నాయి. ఈ మూడో మార్గం అందుబాటులోకి వస్తే దక్షిణ మధ్య రైల్వేకు విజయవాడ డివిజన్ సరకు రవాణా వ్యవస్థలో ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు. ప్రయాణికుల రైళ్లు కూడా సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవచ్చంటున్నారు. ఇటు రైల్వే శాఖ విజయవాడ-గూడూరు మధ్య లెవెల్ క్రాసింగ్ గేట్లు లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ మేరకు అవసరమైన చోట్ల ఆర్‌యూబీలు నిర్మిస్తున్నారు. 2027 చివరి నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని భావిస్తున్నారు రైల్వేశాఖ అధికారులు. ఇటు రైల్వేశాఖ ఇటీవల రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైలు బోగీలలో కెమెరాలు ఏర్పాటు చేస్తన్నారు. వీటిని రైలు ఎంత వేగంగా వెళ్తున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా రికార్డ్ చేసేలా ప్లాన్ చేశారు. అయితే త్వరలోనే విజయవాడ డివిజన్‌లోని అన్ని రైళ్లలోని బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు.