TCS: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టెకీలు ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇతర కంపెనీల్లో పని చేస్తున్నా టీసీఎస్‌లో ఆఫర్ వస్తే వదులుకోరు. అదే ఇప్పుడు వందల మందికి శాపంగా మారింది. ఈ విషయంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మండవీయాకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నాస్‌సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ (NITES) కేంద్రానికి లేఖ రాసింది. సుమారు 600 మంది అనుభవజ్ఞులైన ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు జారీ చేసి జాయినింగ్‌లో మాత్రం తీవ్రమైన జాప్యం చేస్తోందని లేఖలో పేర్కొంది. దీంతో ఆఫర్ లెటర్లు అందుకుని జాయినింగ్ కోసం వేచి చూస్తున్న ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా, వృత్తిపరంగా ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.ఆఫర్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల్లో చాలా మంది బెంగళూలు, హైదరాబాద్, పుణె, కోల్‌కతా, ముంబై, ఢిల్లీకి చెందిన వారిగా తెలిపింది. సదరు అభ్యర్థులు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా లేఖలు సమర్పించినట్లు గుర్తు చేసింది. తొలుత వారు జాయినింగ్ కోసం టీసీఎస్‌కు వెళ్లారని, కానీ, దానిని వాయిదా వేసి ఆ తర్వాత అప్డేట్ పంపలేదని తెలిపింది. ఈ కారణంగా వారు ఆర్థక, మానసిక, వృత్తిపరంగా కుంగిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. టీసీఎస్‌లో ఉద్యోగాల కోసం ఆఫర్ లెటర్లు అందుకుని జాయినింగ్ తేదీల కోసం చూస్తున్న వారికి ఊరట కల్పించాలని, జాయినింగ్ తేదీలకు సంబంధించి కచ్చితమైన టైమ్ లైన్ ప్రకటించేలా జోక్యం చేసుకోవాలని ఎన్ఐటీఈఎస్ కోరింది. జాప్యానికి తగిన ఆర్థిక పరిహారం ఇప్పించాలని, టీసీఎస్ ఎంప్లాయీస్ అసిస్టెంట్ ప్రోగ్రాం ద్వారా అభ్యర్థులకు సాయం చేసేలా చూడాలని కోరింది. టీసీఎస్ ఏం చెప్పిందంటే?ఈ అంశంపై టీసీఎస్ స్పందించింది. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎప్పటిలానే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నామని, తాము ఇచ్చిన అన్ని ఆఫర్లను పూర్తి చేస్తామని తెలిపింది. ఫ్రెషర్లు అయినా, అనుభవజ్ఞులైనా టీసీఎస్ ఆఫర్ లెటర్ అందుకుంటే వారందరూ కంపెనీలో ఉంటారని ఉద్ఘాటించింది. అయితే, వ్యాపార డిమాండ్ ఆధారంగా జాయినింగ్ తేదీలు ఉంటాయని, కొన్ని కోసుల్లో వ్యాపార అవసరాలకు తగినట్లు మారుతుంటాయని గుర్తు చేసింది. ఈ అంశానికి సంబంధించి అభ్యర్థులతో టచ్‌లోనే ఉన్నట్లు తెలిపింది. వారందరూ కంపెనీలో చేరేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొంది.