: కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దాదాపు 1000 ఐటీఐలను (పారిశ్రామిక శిక్షణా సంస్థలు) ఆధునీకరించి.. ఐదేళ్లలో . ఈ రూ. 60 వేల విలువైన ప్రాజెక్టు కోసం.. రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్, మహీంద్రా వంటి డజనుకుపైగా కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. దీంట్లో 8 కంపెనీలు రిలయన్స్, అదానీ, మహీంద్రా, జేకే సిమెంట్, జిందాల్ గ్రూప్, టయోటా ఇండియా, ష్నైడర్ ఎలక్ట్రిక్, ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్.. తమ ప్రాధాన్య రాష్ట్రాలు, రంగాలను ఇప్పటికే మంత్రిత్వ శాఖకు సమర్పించాయి. ఈ కంపెనీలతో సహా లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ), బజాజ్ ఆటో, ఆదిత్యా బిర్లా గ్రూప్ సహా ప్రభుత్వ రంగ సంస్థలు (BHEL), మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వంటివి కూడా రేసులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ 'హబ్ అండ్ స్పోక్ ఐటీఐ' మోడల్‌లో పనిచేస్తుంది. నిధులు.. కేంద్ర ప్రభుత్వం రూ. 30 వేల కోట్లు, రాష్ట్రాలు రూ. 20 వేల కోట్లు, పరిశ్రమలు రూ. 10 వేల కోట్ల మేర సమకూరుస్తాయి. కేంద్ర ప్రభుత్వం వాటాకు.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు 50:50 నిష్పత్తిలో సహకారం అందిస్తాయి. ఇక ఈ భాగస్వామ్య కంపెనీలు.. పరిశ్రమకు అనుగుణంగా నైపుణ్య శిక్షణను అందించేందుకు "హబ్ అండ్ స్పోక్ ఐటీఐ"లను ఏర్పాటు చేయడానికి సహాయపడతాయి. ఈ పథకం కింద 1,000 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి 5 సంవత్సరాల్లోనే 2 మిలియన్ల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ పథకం ద్వారా శిక్షణ, వనరుల కోసం నిర్దేశిత ఐటీఐలు కేంద్రంగా పనిచేస్తాయి. అనుబంధ వృత్తి విద్యా సంస్థలు (స్పోక్స్) అధునాతన మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల మద్దతును కేంద్రం నుంచి పొందుతాయి. దీని ద్వారా శిక్షణ నాణ్యత పెరుగుతుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందుతాయి. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా శిక్షణ కార్యక్రమం NAMTECH (న్యూ ఏజ్ మేకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సీఈఓ అరుణ్‌కుమార్ పిళ్లై మాట్లాడుతూ, "NAMTECH 2028 నాటికి 5 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, ప్రపంచ స్థాయిలో పోటీతత్వం కలిగిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడానికి ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడానికి మేము సిద్ధంగా ఉన్నాము." అన్నారు. జేకే సిమెంట్.. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో నిర్మాణ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఆతిథ్యం రంగాలలో నైపుణ్య శిక్షణను అందించడానికి ప్రతిపాదించింది. మహీంద్రా గ్రూప్.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్ని ఎంపిక చేసుకుంది. ఆటోమోటివ్, ఆతిథ్య రంగాలలో శిక్షణ ఇవ్వడానికి ప్రతిపాదించింది. రిలయన్స్ గ్రూప్.. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధనాలు, రిటైల్, అధునాతన తయారీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ వంటి రంగాలలో శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది.జిందాల్ గ్రూప్ హర్యానా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్‌లలో సాంప్రదాయ, కొత్త తరం వృత్తుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. టయోటా ఇండియా కర్ణాటకలోని ఐటీఐలను ఆటోమొబైల్ సంబంధిత వృత్తుల కోసం అప్‌గ్రేడ్ చేయడానికి ప్రతిపాదించింది. అదానీ గ్రూప్.. గుజరాత్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలలో సోలార్ పవర్, డ్రోన్స్, పోర్ట్ ఆపరేషన్స్ వంటి రంగాలలో శిక్షణ కోసం సంస్థలను అప్‌గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.